CM Revanth Reddy : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్
ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్

కులగణన, రిజర్వేషన్ల సాధనలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీయం రేవంత్‌రెడ్డి అక్కడ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్ల సాధనలో మా ప్రయత్నాలను పూర్తి స్ధాయిలో చేశామని సీయం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సిన ప్రక్రియ అంతటినీ పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వం, బీజేపీల కోర్టులో ఉందని స్పష్టం చేశారు. బీసీలపై ప్రేమ ఉంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం తక్షణం ఆమోదించాలని సీయం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయమైన వాటా సాధించడం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికే మా కొట్లాట అన్నారు. ఈ విషయంలో జంతర్‌మంతర్ వద్ద మా వాణిని బలంగా వినిపించామన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నేతలు మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీల విషయంలో మాకు ఉన్న కమిట్‌మెంట్‌కు వాళ్ళిద్దరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మభ్యపెట్టదని అది బీఆర్‌ఎస్ నైజమన్నారు. బీసీ లకు రాహుల్ ఇచ్చిన మాటను అమలుచేడమే మా టార్గెట్ అని, మోదీ చేతుల్లోనే బీసీ రిజర్వేషన్ నిర్ణయం ఉందన్నారు. మా ఆఖరి పోరాటాన్ని పూర్తిచేశాం ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలన్నారు. కేంద్రం బిల్లు ఆమోదాయించక పోతే.. స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు ఎలా వెళ్లాలో ఆలోచిస్తామన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రజల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని సీయం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
