CM Revanth Reddy: ప్రజల పోరాటాలతో రచించబడిన చరిత్ర మనది: సీఎం రేవంత్ రెడ్డి
రచించబడిన చరిత్ర మనది: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: తెలంగాణ ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు.
సాయుధ పోరాట స్ఫూర్తితో నియంత పాలనను పక్కనపెట్టామని, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతానికి తమ పాలనలో చోటు లేదని సీఎం తెలిపారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు, సామాజిక న్యాయంలో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఉన్నత చదువుల ద్వారా యువత సత్తా చాటాలని, భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. త్వరలో రాష్ట్ర విద్యా విధానం తీసుకొస్తామని ప్రకటించారు. సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు.
డ్వాక్రా ఉత్పత్తుల విక్రయం కోసం మరిన్ని మహిళా మార్టులు ఏర్పాటు చేస్తామని, రైతుల కోసం తెచ్చిన పథకాలు సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రైతుల సంక్షేమంలో రాజీ లేదని, సాగు మోటార్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. పారదర్శకంగా పోటీ పరీక్షలు నిర్వహించి వేగంగా ఫలితాలు వెల్లడిస్తున్నామని, సివిల్స్ పరీక్షలకు ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు.
కృష్ణా, గోదావరి జలాలపై రాజీ లేదు
గత ప్రభుత్వ ‘ధరణి’ వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైందని, తమ ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చి సమర్థంగా అమలు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని, సన్నబియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీజలాలపై రాజీ లేదని, 904 టీఎంసీల సాధనకు ట్రైబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపిస్తామని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌ను గేట్‌వే ఆఫ్ వరల్డ్‌గా మారుస్తాం
హైదరాబాద్‌ను గేట్‌వే ఆఫ్ వరల్డ్‌గా తీర్చిదిద్దుతామని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గోదావరి జలాలతో కాలుష్యం లేని నగరంగా మారుస్తామని, మూసీ నది పరిధిలోని పేదలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో మంచి జీవన ప్రమాణాలు కల్పిస్తామని, పర్యాటకులను ఆకర్షించేలా మూసీని మారుస్తామని తెలిపారు. డిసెంబర్ 9 లోగా అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని, మెట్రో విస్తరణ పనులు త్వరలో మొదలవుతాయని చెప్పారు.
తెలంగాణ అంటే పోరాటాలు, త్యాగాలకు వేదిక అని, డ్రగ్స్ సమస్యను అరికట్టేందుకు ప్రజల సహకారం కోరారు. పోలీసులు మాదకద్రవ్యాల నిర్మూలనలో సత్తా చాటారని కొనియాడారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తున్నామని, డిసెంబర్ 9న దీన్ని ప్రజలకు అందిస్తామని, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని, రీజినల్ రింగ్ రోడ్డు, 12 రేడియల్ రోడ్లతో అభివృద్ధి సూచికగా నిలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.
