Party and government should work as a team - CM Revanth in PAC

పార్టీ, ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలి - పీఏసీలో సీఎం రేవంత్‌

పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ, ప్రభుత్వ వ్యవస్థలు పరస్పరం సమన్వయంతో పని చేయాలని సూచించారు. “పార్టీ, ప్రభుత్వం జోడెదుల్లా పనిచేయాలి,” అని రేవంత్ హితవు పలికారు. గాంధీ భవన్‌లో జరిగిన పీఏసీ మీటింగ్‌లో రేవంత్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో గత పద్దెనిమిది నెలలుగా సాగుతున్న ప్రైస్తుత కాలం 'గోల్డెన్‌ పీరియడ్‌'గా అభివర్ణించారు. ఈ సమయంలో పార్టీకి బలాన్ని చేకూర్చేలా అన్ని స్థాయిల్లో పునర్నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. బూత్, గ్రామ, మండల స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.

పార్టీ బూత్ స్థాయిలో బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లగలమని అన్నారు. పీసీసీ పార్టీ నిర్మాణంపై పూర్తిగా దృష్టి సారించాలనీ, నాయకులంతా ఐక్యంగా, క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. పని చేస్తేనే పదవులు వస్తాయని, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసినవారికి తాము పదవులు ఇచ్చామని రేవంత్ గుర్తుచేశారు. పార్టీ నాయకులు గ్రౌండ్ లెవెల్‌లో పని చేయాలని స్పష్టం చేసిన సీఎం, మార్కెట్ కమిటీలు, టెంపుల్ కమిటీలు వంటి నామినేట్ పదవులను త్వరితగతిన భర్తీ చేయాలని సూచించారు. పార్టీ నాయకులంతా లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేస్తేనే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమవుతుందని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, సామాజికంగా ప్రజలకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకుంటోందని, కానీ.. రాబోయే రోజుల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు వంటి కీలక సవాళ్లు ఎదురయ్యే అవకాశముందని, అందుకు మనం సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. రాబోయే జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి.. తాను స్వయంగా గ్రామాల్లోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీ కార్యకర్తలంతా గ్రామాల స్థాయిలో సజీవంగా పనిచేస్తేనే విజయం సాధ్యమవుతుందని వివరించారు.

Politent News Web4

Politent News Web4

Next Story