Deputy CM Bhatti Vikramarka: ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థుల గుర్తింపు ఆధారిత వివక్షను శాశ్వతంగా అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది.

ఈ సమావేశంలో ‘రోహిత్ వేముల తెలంగాణ (ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ) బిల్లు-2026’ రూపకల్పనపై చర్చించారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన రోహిత్ వేముల విషాద ఘటన దేశవ్యాప్తంగా కదిలించిన సంఘటన అని గుర్తు చేశారు. ఆ సంఘటన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు.

కొత్త చట్టానికి సంబంధించి సమగ్ర విధి-విధానాలతో కూడిన ప్రాథమిక ముసాయిదా నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా అభిప్రాయాలు సేకరించి, త్వరలోనే ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెడతామని భట్టి ప్రకటించారు. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రాకుండా చట్టాన్ని రూపొందించడానికి సుప్రీం కోర్టు అడ్వకేట్, సామాజిక కార్యకర్త దిశా వాడేకర్‌ను ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆహ్వానించి చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.

ఈ చట్టం ద్వారా విద్యా సంస్థల్లో ఎటువంటి వివక్షకు తావు లేని వాతావరణం సృష్టించడం లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story