Revenue Minister Ponguleti: భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: రెవెన్యూ మంత్రి పొంగులేటి
రెవెన్యూ మంత్రి పొంగులేటి

Revenue Minister Ponguleti: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో భూభారతి, రెవెన్యూ శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థను పునర్నిర్మించడంతో పాటు సేవల్లో పారదర్శకతను పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 34 నెలల్లో 12,40,366 మంది రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. భూభారతి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత 5,68,858 పాస్‌పుస్తకాలు పంపిణీ చేశామని చెప్పారు.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను రీ-సర్వే ద్వారా పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సాగుదారులను గుర్తించి వారికి చట్టబద్ధమైన భూ హక్కులు కల్పిస్తున్నామని అన్నారు. ఉదాహరణగా నారాయణపురంలో 906 మంది రైతులకు 1,600 ఎకరాలకు పైగా భూహక్కులు అందించినట్లు వివరించారు. సూర్యాపేట జిల్లాలోని 15 గ్రామాల్లో 2,400 మంది రైతులకు 3,450 ఎకరాలకు పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు.
పాస్‌పుస్తకాలు అందడం వల్ల రైతులకు బ్యాంకు రుణాలు, రైతు భరోసా సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందుతున్నాయని మంత్రి చెప్పారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో రీ-సర్వే పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. భూ హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

