సిట్‌ విచారణకు హాజరు

Phone tapping case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) సీనియర్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీశ్‌రావు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌) విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు ఆయన చేరుకున్నారు.

సోమవారం సిట్ అధికారులు హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన జిల్లా పర్యటనలో ఉండటంతో సిట్ సిబ్బంది కోకాపేటలోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న హరీశ్‌రావుతో పాటు వచ్చిన న్యాయవాదులను స్టేషన్ లోపలికి అనుమతించలేదు. స్టేషన్ చుట్టూ భారీ బలగాలను మోహరించారు. ఈ కేసు దాదాపు రెండేళ్లుగా విచారణలో ఉంది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని, సంబంధిత ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

దర్యాప్తు సమయంలో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ ఓఎస్‌డీగా పనిచేసిన ప్రభాకర్‌రావు విదేశాలకు పారిపోవడంతో ఆటంకాలు ఏర్పడ్డాయి. మిగతా నిందితులను అరెస్టు చేసినా, ప్రభాకర్‌రావు అందుబాటులో లేకపోవడంతో దర్యాప్తు కొంతకాలం నిలిచిపోయింది. గత జూన్‌లో ఆయన హైదరాబాద్‌కు తిరిగి రావడంతో విచారణ మళ్లీ ఊపందుకుంది.

ఈ కేసులో బీఆర్‌ఎస్ అగ్రనేత హరీశ్‌రావును విచారించడం ఇదే తొలిసారి. దర్యాప్తు మరింత ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story