Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు: హరీష్ రావుపై సిట్ సుదీర్ఘ విచారణ.. ‘తెలియదు.. నమ్మను’ అంటూ సమాధానాలు
‘తెలియదు.. నమ్మను’ అంటూ సమాధానాలు

ఏడున్నర గంటలు కొనసాగిన ప్రశ్నోత్తరాలు – మరోసారి హాజరుకు ఆదేశించిన సిట్
Phone tapping case: అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి. హరీష్ రావును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) మంగళవారం ఏకధాటిగా ఏడున్నర గంటల పాటు విచారించింది. దర్యాప్తు అధికారులు ఆయనకు పలు కీలక ప్రశ్నలు సంధించగా, చాలా వాటికి ‘తెలియదు.. గుర్తు లేదు.. నేను నమ్మను’ అనే తరహా సమాధానాలే వచ్చినట్లు తెలుస్తోంది.
సిట్ నోటీసు అనంతరం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని సిట్ కార్యాలయంలో హరీష్ రావు హాజరయ్యారు. తొలుతే ఆయన “నన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేయొద్దు.. అవసరమైతే కోర్టుకు వెళ్తాను” అంటూ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.
విచారణలో సిట్ అధికారులు హరీష్ రావును ఈ కింది అంశాలపై లోతుగా ప్రశ్నించినట్లు సమాచారం:
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయనతోపాటు మరో సీనియర్ భారాస నేత ఫోన్‌పై ఏడాది పాటు నిఘా పెట్టిన విషయం తెలుసా?
నిందితులు అదనపు డీజీపీ ప్రభాకర్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావులకు మీడియా వ్యక్తి శ్రవణ్ కుమార్ రావును ఎందుకు పరిచయం చేశారు?
2023లో శ్రవణ్ రావు సర్వేలో భారాసకు 40 స్థానాలు మించి రావడం లేదని, కానీ ఇంటెలిజెన్స్ సర్వేలో మళ్లీ అధికారంలోకి వస్తుందని చూపడంతో ఆ డేటా సరిచేయించేందుకు ప్రత్యర్థులపై ట్యాపింగ్ ఆదేశించారా?
ఎన్నికలకు ఒక్క రోజు ముందు వరకూ శ్రవణ్ రావు ఇచ్చిన నంబర్లు ట్యాప్ అవుతున్నాయంటే దాని వెనక మీ పాత్ర ఏమిటి?
దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి ఎం. రఘునందన్ రావు కదలికలపై నిరంతర నిఘా, ఆయన వాహనాన్ని పోలీసులతో క్షుణ్ణంగా చెక్ చేయించడం ఎలా సాధ్యమైంది?
ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ విభాగానికి అత్యధికంగా పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేయడానికి కారణం ఏమిటి?
ఈ ప్రశ్నలన్నింటికీ హరీష్ రావు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని, చాలా విషయాలు తనకు తెలియవని, కొన్ని ఆధారాలు నకిలీవని లేదా తనకు సంబంధం లేదని చెప్పినట్లు సిట్ వర్గాలు తెలిపాయి.
సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన కుమారుడికి విమాన ప్రయాణం ఉందని చెప్పడంతో విచారణను తాత్కాలికంగా ముగించిన సిట్.. హరీష్ రావును మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసు సాక్షులను సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని కూడా హెచ్చరించినట్లు సమాచారం.
విచారణ అనంతరం హరీష్ రావు నేరుగా తెలంగాణ భవన్‌కు చేరుకుని కేటీఆర్‌తో సమాలోచనలు జరిపారు. ఈ కేసు రాజకీయ కుట్ర అని భారాస నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో హరీష్ రావు విచారణ మరింత రాజకీయ ఉద్రిక్తతలకు తెరలేపింది.

