Phone tapping with KCR's permission - Gone Prakash Rao after SIT inquiry

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వేడి పెంచుతున్న వేళ, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ ముమ్మరంగా కొనసాగిస్తుండగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాజీ సీఎం కేసీఆర్ అనుమతితోనే జరిగిందని గోనె ఆరోపించారు.



గతంలో ఓటుకు నోటు కేసు కూడా ఈ ట్యాపింగ్ వ్యవస్థ ద్వారానే వెలుగులోకి వచ్చిందని గుర్తుచేశారు. రాజకీయ అవసరాల కోసం, అధికారం కోసం తమ నేతలకే సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేయడం దారుణమని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నేతలైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావుల ఫోన్లు కూడా ట్యాపింగ్‌ చేశారని ఆరోపించారు.



ఇవాళ ఉదయం 10:30కు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ విచారణకు హాజరైన గోనె ప్రకాశ్ రావు.. సిట్ అధికారుల ఎదుట తన వాంగ్మూలాన్ని వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్‌ పరిపాలనలో జరిగిన అన్యాయపు రాజకీయాల రూపమని వ్యాఖ్యానించారు.



గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగిన ఫోన్ ట్యాపింగ్ దాదాపుగా ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా గుర్తింపు పొందే స్థాయిలో ఉందని గోనె పేర్కొన్నారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న దురాశతో, హ్యాట్రిక్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం విచక్షణారహితంగా ట్యాపింగ్‌కు పాల్పడిందని ఆయన మండిపడ్డారు.



ప్రస్తుతం సిట్ విచారణ వేగంగా కొనసాగుతుండగా, ఈ కేసులో మరిన్ని కీలక వ్యక్తులు విచారణకు హాజరవ్వనున్నారు. రాజకీయ వర్గాలు ఈ దర్యాప్తు పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


Politent News Web4

Politent News Web4

Next Story