CM Revanth : భూధార్ నెంబర్ల కేటాయింపునకు ప్రణాళికలు రూపొందించాలి
రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి

- మ్యుటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
- వినియోగదారులకు సౌకర్యవంతంగా ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
- నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం
రాష్ట్రవ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్ల కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వారసత్వ, ఇతర మ్యుటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సీఎం సూచించారు. లైసెన్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియాలో నూతనంగా నిర్మించనున్న 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి కార్యాలయంలో పార్కింగ్, క్యాంటీన్, ఇతర మౌలిక వసతులు ఉండాలని.... కార్యాయాలూ పూర్తిగా
ప్రజలకు స్నేహపూర్వక వాతావరణంలో... సౌకర్యవంతంగా ఉండేలా చూడాలని సీఎం సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు. హైదరాబాద్ నగరంలోని హౌసింగ్ బోర్డుతో జాయింట్ వెంచర్‌గా ఉన్న ప్రాజెక్టుల్లోని సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎం అధికారులకు సూచించారు. సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శులు వి.శేషాద్రి, కె.ఎస్.శ్రీనివాసరాజు, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీసీఎల్ఏ కార్యదర్శి డి.ఎస్.లోకేశ్ కుమార్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
