DGP C.V. Anand: కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ: డీజీపీ సీవీ ఆనంద్
డీజీపీ సీవీ ఆనంద్

DGP C.V. Anand: మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా రాష్ట్ర పోలీస్ శాఖలో మానవ వనరులను పునర్‌వ్యవస్థీకరిస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్‌నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్ ఇబ్బందులు, ఆహార కల్తీ, రోడ్డు ప్రమాదాలు కొత్త సవాళ్లుగా మారాయని ఆయన అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు.
కొత్త సవాళ్లను అధిగమించేందుకు అనుగుణంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్‌ఐబీ లాంటి ప్రత్యేక విభాగాల నుంచి 513 మంది సిబ్బందిని 8 విభాగాలకు కేటాయించామని తెలిపారు. కొత్త బాధ్యతలు అప్పగించే ముందు రెండు నెలల పాటు ఎటాచ్‌మెంట్‌పై పని చేయించామన్నారు. ఇంటర్వ్యూలతో పాటు అకాడమీలో 11 రోజుల ప్రత్యేక శిక్షణ ఇచ్చామని వెల్లడించారు.
గతేడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించడం, ఓ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో 70 శాతం మంది డ్రగ్స్ బారిన పడినట్లు తేలిన నేపథ్యంలో డ్రగ్స్ సరఫరా గొలుసును అడ్డుకోవడంపై దృష్టి సారించినట్లు డీజీపీ చెప్పారు. సమావేశంలో ఆక్టోపస్, సీఐడీ, ఎస్‌ఐబీ, ఇంటెలిజెన్స్ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

