పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మరాయి…!
తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్య

- కమిషనర్లు నెలకోసారైనా ఈ అంశంపై సమావేశం నిర్వహించాలి
- చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై తీవ్ర చర్యలు తీసుకోవాల్సిందే
- ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్‌కుమార్ పోలీసులపై ఫైర్
పోలీస్ స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాలుగా మారాయని, సివిల్ పంచాయితీలకు కేంద్రాలుగా పోలీస్‌స్టేషన్లను మార్చారని పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సివిల్ వివాదాల్లో తలదూర్చద్దని ఎన్ని సార్లు హెచ్చరించినా బెదిరింపులకు దిగుతూ ఏదోఒక క్రిమినల్ కేసు నమోదు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు మండిపడింది. పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూరిస్తే కఠిన చర్యలు తీసుకుని అవి ఇతరులకు తెలిసేలా నెలకోసారి సమావేశాలు నిర్వహించి చెప్పాలని పోలీసు కమీషనర్లను, ఉన్నతాదికారులను హైకోర్టు ఆదేశించింది
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని నాగోల్ బండ్లగూడలోని తన ఇంటి విషయంలో పోలీసులు జోక్యం చేసుకుంటున్నారని.. స్టేషన్‌కు పిలిపించి నకిలీ కేసులు సృష్టించారని.. రూ. 55 లక్షలు చెల్లించి ఇంటిపై ఉన్న సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని పి. సుదర్శనం అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి 9:30 వరకు స్టేషన్‌లో ఉంచి భయబ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించుకోకుంటే జైలుకు పంపాల్సి వస్తుందని హెచ్చరించారని బాధితుడు పిటిషన్‌లో పేర్కొన్నారు.
సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని.. దీనిపై పోలీసులకు తగిన ఆదేశాలివ్వాలని కోరారు. గత విచారణ సందర్భంగా కోర్టుకు హాజరుకావాలని రాచకొండ సీపీ జి.సుదీర్‌బాబు, నాగోల్ సీఐని ఆదేశించడంతో మంగళవారం సీపీ ఆన్‌లైన్‌లో, సీఐ నేరుగా విచారణకు హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ తడకమల్ల వినోద్‌కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీకి న్యాయమూర్తి పలు సూచనలు చేశారు. ఇకపై సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చకుండా నెలవారీగా సమావేశం నిర్వహించాలని.. ఎవరైనా అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశం ఇవ్వాలని సూచించారు. కోర్టులో వివాదం పెండింగ్‌లో ఉన్నా.. ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నా పోలీసుల జోక్యంతో పిటిషన్లు హైకోర్టుకు వస్తున్నాయన్నారు. మూడు రోజుల క్రితం ఓ పోలీసు నడిరోడ్డుపై ఒకరిని కొట్టడం చూశానని.. కానీ ప్రొటోకాల్ కారణంగా తాను కారులోంచి కిందకు దిగలేకపోయానని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వ్యక్తులను కొట్టే అధికారం ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీపీకి స్పష్టం చేశారు. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించి న్యాయస్థానాల ఆదేశాలను పోలీసుల స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)లో చేర్చడంతోపాటు ఎస్‌వోపీలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని డీజీపీకి సూచించారు. దీంతో న్యాయస్థానం సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని సుధీర్‌బాబు చెప్పారు.
