Ponguleti: సింగరేణి కొల్లెరీల భవిష్యత్తు, బకాయిలపై మాజీ మంత్రి కేటీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రంగా విమర్శించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి చేయాల్సిన పనులు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అభాండాలు వేస్తున్నారని ఆయన అన్నారు. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్‌ను సూటిగా సవాలు చేశారు.

భారాస హయాంలో ఒక్కొక్కటిగా బొగ్గు గనులు మూతపడి కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడినా కొత్త గనుల కోసం ప్రయత్నాలు చేయలేదని, టెండర్లలో పాల్గొనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి విమర్శించారు.

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గురువారం హనుమకొండ జిల్లా మడికొండలో కాంగ్రెస్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సన్నాహక సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని సభలో పరిచయం చేశారు. తొలి ప్రాధాన్య ఓటుతోనే గెలిపించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. పార్టీకి ఎంతగానో సేవలందించిన రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిల రాజకీయ వారసుడు సర్వోత్తమ్‌రెడ్డిని గెలిపించుకోవడానికి కమిటీలు వేసుకొని సమన్వయంతో పని చేయాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి ఇంతటి పట్టున్న చోట భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఎంపీలు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బలరాం నాయక్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రాంచంద్రు నాయక్‌, కేఆర్‌ నాగరాజు, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్‌, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, యశస్వినీ రెడ్డి తదితరులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు సమావేశంలో పాల్గొన్నారు.

Next Story