పొంగులేటి ఎదురుదాడి

Ponguleti Srinivasa Reddy: నాదర్‌గుల్ భూముల విషయంలో బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన పొంగులేటి, హరీశ్‌రావు ఆరోపణలను ఒక్కొక్కటిగా ఖండించారు.

సర్వే నంబర్ 613లోని భూములను 2014లో మూడు సంస్థలకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేసిందని మంత్రి స్పష్టం చేశారు. 2016లో మ్యుటేషన్ జరిగినప్పుడు కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. “2014, 2016లో జరిగిన రిజిస్ట్రేషన్లకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా?” అని ప్రశ్నించారు.

హరీశ్‌రావు చెబుతున్న భూముల్లోనే 2022లో నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, భూములు పొందిన వారు నాలా కన్వర్షన్ ఇవ్వకపోవడంతో అదే సంవత్సరం సుప్రీం కోర్టుకు వెళ్లారని తెలిపారు. “ఆ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేం ప్రభుత్వ భూములు అని చెప్పి కౌంటర్ వేశాం” అని వివరించారు.

“ఆనాడు వాటాల ఒప్పందం చేసుకుని భూములు కట్టబెట్టి, ఇప్పుడు మా మీద నిందలు వేస్తున్నారు. నాదర్‌గుల్ భూముల్లో వాటా రాకపోవడంతోనే హరీశ్‌రావు ఇవాళ ఈ దుష్ప్రచారం చేస్తున్నారు” అని మంత్రి ఆరోపించారు. ప్రొహిబిటెడ్ భూముల్లో తమ ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదని, హరీశ్‌రావు పేర్కొన్న కంపెనీల్లో తన కుటుంబ సభ్యులెవరూ లేరని స్పష్టం చేశారు. “నా కుటుంబ సభ్యులు ఉన్నారని నిరూపించాలని సవాల్ చేస్తున్నా” అని అన్నారు.

వట్టి నాగులపల్లి భూముల విషయంలోనూ హరీశ్‌రావు పూర్తి దుష్ప్రచారం చేస్తున్నారని, కుటుంబ వివాదాలను కూడా ప్రభుత్వానికి అంటగట్టుతున్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story