Ponguleti Srinivasa Reddy: అర్హులైన నిర్వాసితులకు ఈ నెల 15 లోపు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు - రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti Srinivasa Reddy: ఖమ్మం వెలుగుమట్ల వినోబాభావే నగర్‌లోని భూదాన్ భూములపై అక్రమంగా నిర్మించిన ఇళ్లను తొలగించిన తర్వాత నిరాశ్రయులైన వారిలో నిజమైన పేదలు ఉన్నారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అర్హులైన వారికి ఈ నెల 15వ తేదీలోపు నివాస యోగ్యమైన స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, నిర్మాణానికి ముగ్గు పోస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఖమ్మం కలెక్టరేట్‌లో ఆదివారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్‌దత్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడిన మంత్రి, భూదాన్ భూముల్లో 720 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నాయని తెలిపారు. ఇందులో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, మరికొందరు గతంలోనే ఇందిరమ్మ ఇళ్లు పొందినవారు ఉన్నారని, మిగిలిన వారిలో ఎక్కువ మంది నిరుపేదలే అని వివరించారు.
ఇళ్ల కూల్చివేత తర్వాత పూర్తి స్థాయి సర్వే చేయడంతో నిజాలు బయటపడ్డాయని మంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పేదలకు ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని, రాజకీయాలకు అతీతంగా సామాజిక, ఆర్థిక సర్వేల ఆధారంగా అర్హులను గుర్తిస్తున్నామని చెప్పారు.
వెలుగుమట్లలో పేదలు ఉచితంగా ఇళ్లు కట్టుకోలేదని, రూ.30 వేల నుంచి రూ.8 లక్షల వరకు స్థానిక నాయకులు అక్రమంగా వసూలు చేశారని మంత్రి ఆరోపించారు. ఆ మొత్తాన్ని బాధితులకు తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
కొత్తగా కేటాయించే స్థలాల్లో మౌలిక వసతులతో పాటు అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ బడి ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి కూల్చివేతలు జరిగాయని, బాధితులు రెండుసార్లు నష్టపోయారని, దళారుల మాటలు నమ్మి మోసపోయారని వారే చెబుతున్నారని తెలిపారు.
కొందరు మాజీ మంత్రులు చిన్న రాజకీయాలు చేస్తున్నారని, విపక్షాలు నిజాలను మాట్లాడాలని మంత్రి పొంగులేటి కోరారు. ప్రభుత్వం పేదల దీవెనతో ఏర్పడిందని, అందుకే అర్హులందరికీ త్వరిత సహాయం అందిస్తామని ఆయన ఉద్ఘాటించారు.

