భూ లావాదేవీల్లో అక్రమాలకు చెక్, రైతులకు పారదర్శక సేవలు

Ponguleti Srinivasa Reddy: రాష్ట్రంలో భూ క్రయవిక్రయాల్లో అక్రమాలను అరికట్టి, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సమీకృత భూభారతి పోర్టల్‌ను రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార & ప్రజాసంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు.

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది. ఆవిష్కరణ అనంతరం మంత్రి మాట్లాడుతూ, “ఇది ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రభుత్వం” అని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ పోర్టల్ ఏప్రిల్ 2 నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రెవెన్యూ, సర్వే, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చి, భూముల సమాచారం, సర్వే, కరెక్షన్, అప్పీల్, రిజిస్ట్రేషన్ వంటి సేవలను ఏకీకృతంగా అందించడం దీని ముఖ్య లక్ష్యం.

ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయితే వెంటనే భూమి వివరాలు, భూధార్ నంబరు, ఆర్‌ఓఆర్, మ్యుటేషన్, ఈసీ, మార్కెట్ వాల్యూ, విలేజ్ మ్యాప్ వంటి సమాచారం ఒక్క క్లిక్‌లో లభిస్తాయి. ప్రతి దశలో అప్లికేషన్ స్టేటస్ ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలను సరిద్దుకుని, మరింత పారదర్శకంగా, రైతు కేంద్రీకృతంగా ఈ పోర్టల్‌ను రూపొందించామని మంత్రి వివరించారు.

ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.

ఈ సమీకృత భూభారతి పోర్టల్ ద్వారా భూ వివాదాలు తగ్గి, రైతులు ఇంటి నుంచే సులభంగా భూ సంబంధిత సేవలు పొందవచ్చని అధికారులు వెల్లడించారు. పైలట్ ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story