Minister Ponguleti: పేదలు జీవితకాలం సొంత ఇల్లు కోసం ఆవేదన చెందుతుంటారని, వారి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నాంపల్లి నియోజకవర్గం రెడ్‌హిల్స్‌లో సుమారు ఐదు ఎకరాల్లో 480 ఫ్లాట్లతో నిర్మించనున్న ‘ఇందిరమ్మ టవర్స్‌’కు మంత్రి అజారుద్దీన్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి పొంగులేటి.. ‘‘ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం పూర్తి చేసి పేదలకు రూ.80 లక్షల నుంచి రూ.కోటి విలువ చేసే ఫ్లాట్ల తాళాలు అందిస్తాం. కోర్‌ ప్రాంతంలో ప్రభుత్వ శాఖల భూములను గుర్తించి గృహనిర్మాణ శాఖకు బదలాయించి పేదల కోసం జీ+10 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లు నిర్మించాలని సంకల్పించాం. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు లేకుండా నేరుగా లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తాం. ఆ ఇంటిపై పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాల కోసం రూ.10-20 లక్షల రుణం పొందే వెసులుబాటు కల్పిస్తున్నాం’’ అని వివరించారు.

మొదటి విడతలో 480 మందికి డ్రా ద్వారా ఇళ్లు కేటాయించినట్లు తెలిపిన ఆయన, త్వరలోనే రెండు, మూడు, నాలుగు విడతల్లో మిగిలిన వారికి కూడా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం లక్కీడ్రాలో విజేతలైన లబ్ధిదారులకు ఫ్లాట్‌ నంబర్లు కేటాయిస్తూ వారి పేర్లను ప్రకటించారు.

కార్యక్రమంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే మాజిద్‌ హుస్సేన్, కలెక్టర్‌ డా. ప్రియాంక, గృహనిర్మాణ కార్పొరేషన్‌ ఎండీ వీపీ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Next Story