యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణచందర్ కు 14 రోజుల రిమాండ్

టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆమె స్నేహితుడు పూర్ణచందర్ కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శనివారం రాత్రి తన లాయర్ వెంటపెట్టుకుని వచ్చి పోలీసులకు లొంగిపోయిన పూర్ణచందర్‌ను పోలీసులు సోమవారం న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇదిలా ఉండగా పూర్ణచందర్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది. తనకు సంబంధించిన అన్నివిషయాలు బీఆర్‌ఎస్ నేత సంతోష్‌రావుకు తెలుసని పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్ లో పూర్ణచందర్ తెలిపినట్లు సమాచారం. స్వేచ్ఛతో తను రిలేషన్‌షిప్ లో ఉన్నట్లు కూడా సంతోష్ రావుకు తెలుసని పూర్ణచందర్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే భర్తతో విడాకులు తీసుకుంటే పెళ్ళి చేసుకుంటానని స్వేచ్ఛతో పూర్ణచందర్ చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెపుతున్నారు. పూర్ణచందర్ మాటలు నమ్మి స్వేచ్ఛ తన భర్తకు విడాకులు ఇచ్చిందని, ఇప్పుడు తాను పెళ్ళి చేసుకోనని, నన్ను ఏమీ చేయలేవని పూర్ణచందర్ స్వేచ్ఛను బెదిరించినట్లు ఆమె కుటుంబ సభ్యులు చెపుతున్నారు. వారం రోజుల క్రితం స్వేచ్ఛ, పూర్ణచందర్ లు అరుణాచలం వెళ్ళారని, తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరి మధ్యా పెళ్లి ప్రస్తావన వచ్చి గొడవ జరిగినట్లు చెపుతున్నారు. ఈసందర్భంలో తాను స్వేచ్ఛను పెళ్లి చేసుకోనని పూర్ణచందర్ స్పష్టం చేశాడని అంటున్నారు.
