తెలంగాణ కాంగ్రెస్‌లో నెలలుగా పెండింగ్‌లో ఉన్న పదవుల భర్తీపై ఎట్టకేలకు అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఇప్పటికే ముగ్గురికి మంత్రి పదవులు కేటాయించగా.. టీపీసీసీలో ప్రధాన పదవులకు నాయకులను ఎంపిక చేస్తూ 96 మందితో కూడిన జాబితా విడుదల చేసింది. ఇందులో 27 మందికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69 మందికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. ఎంపిక చేసిన వారిలో ఒక ఎంపీ, ఐదుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌, బసవరాజు సారయ్యకు ఉపాధ్యక్ష పదవులు దక్కగా, వెడ్మ బొజ్జు, పర్నికారెడ్డి, మట్టా రాగమయి వంటి నేతలు జనరల్ సెక్రెటరీలుగా ఎంపికయ్యారు.



ఈ పదవుల కేటాయింపులో కాంగ్రెస్ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసింది. ఉపాధ్యక్షుల పదవుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 చోట్లను కేటాయించారు. మొత్తం జనరల్ సెక్రెటరీల 69 స్థానాల్లో బీసీలకు 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. ఈ నియామకాలన్నీ దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు మొత్తంగా 67 శాతం ప్రాతినిథ్యం కల్పించింది.



అటు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. మంత్రుల శాఖల కేటాయింపుపై, అసంతృప్తులను ఎలా చక్కబెట్టాలన్నదానిపై సమగ్రంగా చర్చించారు. ప్రస్తుతం రేవంత్ వద్ద ఉన్న హోం, ఎడ్యుకేషన్, మున్సిపల్, మైనింగ్, మైనారిటీ, కమర్షియల్ ట్యాక్స్, లా, లేబర్, స్పోర్ట్స్, యువజన శాఖలు తదితర కీలక శాఖలను కొత్త మంత్రులకు అప్పగించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.



గడ్డం వివేక్‌కు లేబర్, మైనింగ్‌, స్పోర్ట్స్ శాఖలు, వాకిటి శ్రీహరికి లా, యూత్, పశుసంవర్థక లేదా మత్స్యశాఖలు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖలు ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. పదవికి దూరమైన నేతలను సమర్థవంతంగా మేనేజ్‌ చేసే దిశగా కూడా చర్చలు సాగినట్లు సమాచారం.



ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు.. కార్పొరేషన్లకు సంబంధించిన పదవుల భర్తీలపై కూడా త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అంతర్గత విభేదాలు, బీజేపీతో ఉన్న సంబంధాలపై వ్యూహాత్మకంగా దాడి చేస్తూ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని అధిష్ఠానం సీఎం రేవంత్‌రెడ్డికి స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.




Politent News Web4

Politent News Web4

Next Story