కాళేశ్వరంపై పీపీటీ ఇస్తామన్న హరీష్‌… ఆ సాంప్రదాయం లేదన్న డిప్యూటీ సీయం భట్టి

కాళేశ్వరం ప్రాజెక్టుపై తమ హయాంలో ఏం చేశామన్న విషయంపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తామంటే ప్రభుత్వానికి భయమెందుకని మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌ రావు ప్రశ్నించారు. శనివారం ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో పొల్గొనడానికి వచ్చిన హారీష్‌ రావు లాబీల్లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ప్రస్తావన వచ్చింది. ఈ విషయంపై హరీష్‌ రావు మాట్లాడుతూ తమకు కాళేశ్వరంపై అసెంబ్లీలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి అనుమతి ఇవ్వడం లేదంటే ప్రజలకు నిజాలు ఎక్కడ తెలుస్తాయో అని ఈ ప్రభుత్వం భయపడుతున్నట్లే అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వడానికి అనుమతి ఇస్తే అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు వివరిస్తాం కదా అని హరీష్‌ రావు అన్నారు. వాస్తవాలు వినడానికి కాంగ్రెస్‌ పార్టీకి గానీ శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకి కానీ ఇష్టం లేదని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. నిజానిజాలు తేల్చాల్సింది కోర్టులు మాత్రమే అని ఈ సందర్భంగా హరీష్‌ రావు అన్నారు.

ఇక ఇదే అంశంపై అసెంబ్లీ లాబీల్లో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా ప్రతిపక్షంగా ఉన్న మాకు పీపీటీ ఇవ్వడానికి అవకాశం ఇవ్వమని లేఖ కూడా ఇచ్చామని అయినా ఆనాడు మాకు అవకాశం ఎందుకు ఇవ్వలేదని డిప్యూటీ సీయం ప్రశ్నించారు. అప్పుడు లేని సాంప్రదాయం ఇప్పుడు ఎలా ఉంటుందని భట్టి విక్రమార్క నిలదీశారు. ప్రభుత్వం రూ. 6500 కోట్లు వడ్డీ కట్టడం లేదని బీఆర్‌ఎస్‌ చేస్తున్న వాదన సరికాదని, వడ్డీలు మేము కట్టకపోతే బీఆర్‌ఎస్‌ వాళ్ళు కడుతున్నారా అని డిప్యూటీ సీయం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story