CM Revanth Reddy: తరతరాల అణచివేత, దోపిడీ, పెత్తందారీ విధానాలపై ధిక్కార స్వరం వినిపించిన నేల తెలంగాణ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల స్వేచ్ఛ, ఆత్మగౌరవం, హక్కుల కోసం పోరాడిన యోధులకు నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు.

‘‘నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులకు తెలంగాణ పుట్టినిల్లు. అస్థిత్వం, ఆత్మగౌరవం, హక్కుల కోసం ఈ నేల చైతన్యాన్ని రగిల్చింది. సమ్మక్క-సారలమ్మ పోరాటం నుంచి సాయుధ పోరాటం వరకు అన్యాయాన్ని ఎదిరించడం ఈ గడ్డ స్వభావం. సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్‌ 17కు ప్రత్యేక స్థానముంది,’’ అని సీఎం వివరించారు.

నిజాం పాలనలో హైదరాబాద్‌ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినా, గ్రామీణ తెలంగాణలో భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరి, అణచివేతలు, చివరి దశలో రజాకారుల దౌర్జన్యాలు ప్రజలను కల్లోలపరిచాయని గుర్తు చేశారు. భారతదేశంలో అంతర్భాగం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలపడిందని, రజాకారుల ఆగడాలకు వ్యతిరేకంగా భూమి, భుక్తి కోసం కమ్యూనిస్టులు పోరాడారని చెప్పారు. నెహ్రూ, పటేల్‌ నాయకత్వంలో సైనిక చర్య (ఆపరేషన్‌ పోలో) అనంతరం 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ అధికారికంగా భారత్‌లో అంతర్భాగమైందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మార్గం తెరుచుకున్న చారిత్రక సందర్భమిదని అన్నారు.

‘‘ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. తెలంగాణ పొరుగు రాష్ట్రాలతోనే కాదు.. ప్రపంచంతో పోటీ పడుతోంది,’’ అని సీఎం చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలకు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే 91 శాతం అధికమని తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీతో 25.35 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. వ్యవసాయం, రైతు సంక్షేమానికి 32 నెలల్లో రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపామని, దేశంలోనే తొలిసారి ఎస్సీ వర్గీకరణ చేపట్టినట్లు తెలిపారు. 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని, యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం న్యాయ పోరాటం చేస్తున్నామని, 55 కి.మీ. పరిధిలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టామన్నారు. రూ.38,595 కోట్లతో 122.9 కి.మీ. మెట్రో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని తెలిపారు. 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని, డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026లో ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ఆవిష్కరిస్తామని అన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

‘‘చరిత్రను మరిచిపోం.. చరిత్ర దగ్గరే ఆగిపోం. పోరాట స్ఫూర్తితో ఆధునిక తెలంగాణను నిర్మించుకుందాం,’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Next Story