Minister Uttam Kumar Reddy: ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం సకాలంలో అందకపోతే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పునరావాసం, అటవీ అనుమతులపై శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన మంత్రి ఈ విషయాన్ని సూచించారు.

భూ సేకరణ కోసం ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందని, ఈ నిధులను నిర్వాసితులకు వెంటనే అందించేలా కలెక్టర్లు ఏర్పాట్లు చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ‘పీడీ ఖాతాల్లో జమ చేస్తే సరిపోదు. భూమి కోల్పోయిన వారికి నిజంగా చేరాలి’ అని మంత్రి అన్నారు.

ఇప్పటి వరకు రూ.2,782 కోట్లు విడుదలైనట్లు అధికారులు తెలిపారు. అందులో రూ.566 కోట్లు లబ్ధిదారులకు చేరాయి. రూ.989 కోట్ల చెల్లింపులు వివిధ దశల్లో ఉన్నాయి. రూ.199 కోట్లు జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. నిధుల విడుదలపై తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జగిత్యాల, సిద్దిపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లో పంపిణీ చేయాల్సిన నిధుల వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు.

రెవెన్యూ, నీటిపారుదల, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేసి అటవీ భూముల అడ్డంకులు తొలగించాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్, ఈఎన్సీలు రమేశ్‌బాబు, ఆర్‌.మధుసూదన్, టి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story