Governor Shiv Pratap Shukla: నాణ్యమైన విత్తనాలే వ్యవసాయ పురోగతికి మార్గం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
గవర్నర్ శివప్రతాప్ శుక్లా

Governor Shiv Pratap Shukla: ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులను ఇచ్చే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. విత్తన పరిశోధన, ఉత్పత్తి, పరీక్ష, ధ్రువీకరణ రంగాల్లో తెలంగాణ మరింత పురోగతి సాధించాలని ఆయన అన్నారు.
గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్-ఆఫ్రికా విత్తన సదస్సు-2026కు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ, వ్యవసాయ ప్రగతిలో విత్తనాల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. ‘‘విత్తనాలపై నిరంతరం పరిశోధనలు జరగాలి. అన్నదాతలకు భరోసా కల్పించాలి. విత్తన పరిష్కారాలు, ఆహార భద్రత కలిగిన భవిష్యత్తు కోసం భాగస్వామ్యాలను పెంపొందించాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
విచక్షణ రహితంగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించాలని గవర్నర్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రైతులు సాగు పద్ధతులను మార్చుకొని సహజ వ్యవసాయం ద్వారా సుస్థిరత వైపు అడుగులు వేయాలని అన్నారు. భారత్-ఆఫ్రికా మధ్య వ్యవసాయ సహకారాన్ని విస్తరించాలని, ఈ దిశగా ఇక్రిశాట్ వంటి సంస్థలు చొరవ తీసుకోవాలని కూడా గవర్నర్ కోరారు.

