Rahmath Baig: మజ్లిస్ (ఎమ్‌ఐఎమ్) పార్టీలో ఒకసారి కాదు.. రహ్మత్ బేగ్ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఓ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్‌ను పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం, ముఖ్యంగా అసదుద్దీన్ ఓవైసీ ఆదేశించినా ఆయన ససేమిరా అంటున్నారు. మూడు రోజులు గడిచినా రాజీనామా చేయకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కలకలం నెలకొంది.

ఇటీవల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మజ్లిస్ పార్టీ రహ్మత్ బేగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అదే సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కూడా ఆదేశించింది. అయితే పరారీలో ఉన్న రహ్మత్ బేగ్‌ను పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు.

తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ చివరకు స్పందించారు. “నేను ఏ తప్పూ చేయలేదు. ఉద్దేశపూర్వకంగా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఫేక్ వీడియోలు సృష్టించి లేనిపోని అభాండాలు వేస్తున్నారు” అని ఆయన అన్నారు. ఈ విషయమై ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేశానని కూడా తెలిపారు.

పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ రాజీనామా చేయనని స్పష్టం చేయడంతో మజ్లిస్ నాయకత్వం ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటోంది. ఈ వ్యవహారం పార్టీకి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.

Next Story