తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి మరికొన్ని గంటల్లో ఖరారు అవుతున్న పరిస్ధితుల్లో ఆ పార్టీలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. గోషామహల్‌ అసెంబ్లీ స్ధానం నుంచి బీజేపీ తరపున వరుసగా మూడు సార్లు ఎన్నికైన రాజాసింగ్ ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనమాకు దారి తీసిన పరిస్ధితులను వివరిస్తూ ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సుదీర్ఘ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా ఎంపిక చేస్తున్న భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడి విషయంలో కార్యకర్తల అసహనాన్ని కోపాన్ని ప్రతిఫలిస్తూ తాను ఈ రాజీనమా నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో రాజాసింగ్‌ పేర్కొన్నారు. ఎన్‌.రామచంద్రరావుని బీజేపీ అధ్యక్షుడిగా నియమించడం తెలంగాణ బీజేపీ శ్రేణులను షాక్‌ కి గురిచేయడమే కాకుండా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని రాజసింగ్‌ లేఖ ద్వారా కిషన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీ అధ్యక్ష పదవి పొందడానికి తెలంగాణలో అనేక మంది అర్హులు ఉన్నారని, పార్టీ కోసం నిరంతరాయంగా శ్రమిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎంతో మంది ఉండగా రామచంద్రరావును అధ్యక్షుడిగా ఎంపిక చేయడంతో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అనేక అనుమానాలు కలుగుతున్నాయని రాజాసింగ్‌ తన అభిప్రాయాన్నివ్యక్తం చేశారు. వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందిన నిబద్దత గల బీజేపీ కార్యకర్తగా ఈ ఎంపిక పట్ల తీవ్రంగా కలత చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజాసింగ్‌ లేఖలో పేర్కొన్నారు. తాను భారతీయ జనతా పార్టీలో లేననే విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ కు కూడా తెలియజేయమని లేఖలో కిషన్‌ రెడ్డిని కోరారు. నేను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా హిందుత్వ భావజాలానికి సనాత ధర్మం పరిరక్షణకు కట్టుబడే ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇదే లేఖలో ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, హోంమంత్రి అమిత్‌ షాలను ప్రస్తావిస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీకి అధికారం కట్టబెట్టడానికి సిద్దంగా ఉందని, దాన్ని అందిపుచ్చుకోవడానికి సరైన నాయకత్వాన్ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని, ఈ అవకాశాన్ని వదులు కోకుండా అధ్యక్ష నియామకంపై పునరాలోచించుకోవాలని రాజాసింగ్‌ అభ్యర్థించారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story