Defence Minister Rajnath Singh: తెలంగాణ ముఖద్వారమైన ఆదిలాబాద్‌లో విమానాశ్రయ నిర్మాణం రక్షణశాఖ ఆధ్వర్యంలోనే జరగనుంది. ప్రస్తుతం ఆ శాఖ ఆధీనంలో ఉన్న 360 ఎకరాల ఎయిర్‌స్ట్రిప్‌కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 450 ఎకరాలు కేటాయిస్తే, పూర్తిగా రక్షణశాఖ బాధ్యతలో విమానాశ్రయం నిర్మించి, పౌర సేవలకు అనువుగా ఒక ఎన్‌క్లేవ్‌ను ఏర్పాటు చేయడానికి పౌరవిమానయాన శాఖకు అనుమతి ఇవ్వడానికి సిద్ధమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.

ఈ ముఖ్యమైన అంశంపై కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్‌మోహన్‌నాయుడు, స్థానిక ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్‌శంకర్, ఆదిలాబాద్ కలెక్టర్ బుధవారం ఢిల్లీలోని కర్తవ్యభవన్‌లో రక్షణశాఖ కార్యాలయంలో రాజ్‌నాథ్‌సింగ్‌తో విస్తృతంగా చర్చించారు.

గతంలో ఈ విమానాశ్రయాన్ని రక్షణ-పౌరవిమానయాన శాఖల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని భావించినా, ఆ ప్రాంతం యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యత దృష్ట్యా పూర్తిగా రక్షణశాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేపట్టి, శిక్షణా అవసరాలకు తగ్గ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన పౌరవిమానయాన మంత్రి రామ్‌మోహన్‌నాయుడు ఈ విషయాలను వివరించారు.

“దేశంలో ప్రస్తుతం 165 విమానాశ్రయాలు ఉన్నాయి. 2047 నాటికి వాటిని 350కి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో ఆదిలాబాద్‌కు అత్యంత అనుకూల అవకాశాలు ఉన్నాయి” అని అన్నారు.

తాను పౌరవిమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కిషన్‌రెడ్డి వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో డిఫెన్స్‌ సంబంధిత 360 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించాలని కోరారని తెలిపారు. దానికి రక్షణశాఖ ఆమోదం అవసరమవడంతో కిషన్‌రెడ్డి గతంలోనే రక్షణమంత్రిని ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి సంయుక్తంగా నిర్మించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని రక్షణశాఖ గతంలోనే సూత్రప్రాయ అంగీకార లేఖ ఇచ్చింది.

అయితే, అక్కడ ఎయిర్‌బస్ తరహా పెద్ద విమానాలు దిగే రన్‌వే నిర్మించాలంటే మరో 450 ఎకరాలు అవసరమని, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని రామ్‌మోహన్‌నాయుడు తెలిపారు. ఈ ప్రక్రియలో రక్షణశాఖ నుంచి పూర్తి మద్దతు అవసరమని స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి దిశగా మరో ముఖ్యమైన అడుగు ముందుకు వేయనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story