Ramreddy Damodar Reddy: స్నేహితుడిని ముఖ్యమంత్రిని చేయాలని పదవి త్యాగం చేసిన దామోదర్‌రెడ్డి
పదవి త్యాగం చేసిన దామోదర్‌రెడ్డి

Ramreddy Damodar Reddy: రాజకీయ రంగంలో మంత్రి పదవి కోసం అందరూ పోటీపడుతుంటారు. అయితే, తన స్నేహితుడిని ముఖ్యమంత్రిని చేయాలని గట్టిగా వాదించి, తన క్యాబినెట్ మంత్రి స్థానాన్ని, తర్వాతి ఎన్నికల్లో తనతోపాటు తన సొంత అన్న టికెట్‌ను కూడా కోల్పోయిన నాయకుడు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన ఆయన 1993లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిని సీఎం పదవి నుంచి తప్పించే సమయంలో, తన మిత్రుడు వైఎస్‌ఆర్‌ను సీఎం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు మాత్రం కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని సీఎం చేశారు. దీంతో 1994 ఎన్నికల్లో దామోదర్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుండా, అప్పటి సీఎం కోట్ల తన చిన్నకోడలు మేనమామ అయిన జన్నారెడ్డి సుధీర్‌రెడ్డికి టికెట్ కట్టబెట్టారు.
దామోదర్‌రెడ్డి సొంత చెల్లెలు సుధీర్‌రెడ్డి అన్న శ్యామ్‌సుందర్‌రెడ్డిని వివాహం చేసుకున్నారు. ‘నాకు టికెట్ ఇవ్వకపోతే ఏమిటి? నా సత్తా చూపిస్తా’ అని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ హవా సాగినా, తుంగతుర్తి నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో దామోదర్‌రెడ్డి అన్న రాంరెడ్డి వెంకటరెడ్డి కేవలం 1,700 ఓట్ల తేడాతో పరాజయం చెందారు.
1994లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌కు కేవలం 26 సీట్లు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 21 స్థానాల్లో ఒక్కటి కూడా గెలవలేదు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ టీడీపీలో చేరాలని ఆహ్వానించినా, దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌తోనే కొనసాగారు. కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి దక్కన్ క్రానికల్ చైర్మన్ వెంకట్రామిరెడ్డికి ఓటు వేశారు. పదేళ్ల తర్వాత, వైఎస్‌ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్యాబినెట్‌లో అన్నదమ్ములు (2004లో తమ్ముడు, 2009లో అన్న) మంత్రులుగా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదుసార్లు గెలిచి మంత్రులుగా పనిచేసిన సోదరులు మరొకరు లేరు.
అన్న రాంరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా సేవలందించారు. 2016లో ఆయన ఎమ్మెల్యే హోదాలోనే మరణించారు. దామోదర్‌రెడ్డి వరుస ఎన్నికల్లో విజయాలు సాధించినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014, 2018, 2023లో సూర్యాపేట నుంచి వరుసగా ఓడిపోయారు.
