Tumor in Cow Leg : అనాధ గోవు కాలికి ఉన్న కణితి తొలగింపు
గోవుకి చికిత్స అందించి మానవత్వం చాటుకున్న రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత శ్రీరాములు

సాధారణంగా మన చుట్టూ అనేక మూగ జీవులు అనాధల్లా తిరుగుతూ ఉంటాయి. వాటిలో చాలా జీవాలు అనేక రుగ్మతలతో బాధపడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకు రోడ్ల మీద ఎవరికీ చెందని గోవులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నింటికి కాళ్ళకు దెబ్బలు తగిలి పుళ్ళు పడి, గోళ్ళు దెబ్బతిని నడవలేని స్ధితిలో ఉంటాయి. వాటిని ప్రతినిత్యం చూస్తూ ఉంటాం కానీ అలా అనారోగ్యంతోనే ఇతర గాయాల సమస్యలతోనే ఇబ్బంది పడుతున్న గోవులను చేరదీసి చికిత్స చేయిద్దామని ఎవరూ ఆలోచించరు. కానీ అంబర పేటలో నివసించే శ్రీరాములు అలా కాదు. రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా అయిన శ్రీరాములు మూగజీవాల పట్ల జాలీ, కరుణ కలిగి ఉంటారు. ముఖ్యంగా గోవులు ఇబ్బంది పడుతూ కనిపిస్తే వాటిని చేరదీసి చికిత్స చేయిస్తూ ఉంటాడు. అలా శ్రీరాములుకు అంబర్ పేటలో ఒక గోవుకి కాలి భాగంలో ఏర్పడిన కణితి కారణంగా నడవలేక పోతూ కనిపించింది. నోరు లేని ఆ మూగజీవి తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతోంది. అస్సలు నడవలేని స్ధితితో ఉన్న ఆ గోవును వెంటనే చేరదీసి ప్రధమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నారు శ్రీరాములు. గోవు పరిస్ధితి గమనించిన శ్రీరాములు పశువుల వైద్యుడ్ని పిలిపించి ఆ గోవు కాలికి ఉన్న కణితిని తొలగించి చికిత్స చేయించారు. కణితి తొలగిపోవడంతో గోవు ఇప్పటి వరకూ అనుభవించిన నరకయాతన నుంచి కోలుకుని నడవడం ప్రారంభించింది. శ్రీరాములు చేసిన పనికి గో ప్రేమికులు అభినందించారు.
