Justice B. Sudarshan Reddy: భావస్వేచ్ఛపై ఆంక్షలా? అభివృద్ధి మాటల వెనుక రేషన్ లబ్ధిదారుల పెరుగుదలపై ప్రశ్నించిన జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి
జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి

సామాజిక, ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్యానికే ముప్పు
సర్ బాధితులు సంఘటితంగా పోరాడాలి: పరకాల ప్రభాకర్
Justice B. Sudarshan Reddy: ప్రధాని మోదీ ప్రపంచంలో ఎక్కడా లేని అభివృద్ధి దేశంలో జరుగుతోందని చెబుతుండగా, రేషన్ బియ్యం లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతోందని చెప్పడం విడ్డూరంగా ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంటే రేషన్ బియ్యం తిని బతికేవారి సంఖ్య ఎందుకు పెరుగుతోందని ప్రశ్నించారు.
‘79 ఏళ్ల స్వాతంత్య్రం - పౌర హక్కులు’ మరియు ‘భారత రాజ్యాంగం - సామాజిక న్యాయం’ అంశాలపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం కూకట్‌పల్లి జేఎన్టీయూ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక న్యాయం లేకపోతే సమానత్వం సాధ్యం కాదని, సమానత్వం లేకుంటే సౌభ్రాతృత్వం సాధ్యం కాదన్నారు. ప్రజల్లో ఆర్థిక వ్యత్యాసాలను క్రమంగా తగ్గించాలని, కానీ సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ చర్యలు స్వభావరీత్యా తాత్కాలికమైనవని పేర్కొన్నారు. ఆదేశిక సూత్రాలకు అంతరాయాలు కలిగిస్తే అశాంతికి దారి తీసి సమాజం మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, అప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కష్టమవుతుందని అన్నారు.
పాలకులను ప్రశ్నించే వారిని ‘దిమాగీ నక్సల్స్’ అని ప్రధాని మోదీ పేర్కొనడం ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమేనని జస్టిస్ సుదర్శన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. కార్పొరేట్ల దోపిడీని నిలదీస్తున్న వారిని అభివృద్ధి సహించని వ్యక్తులని దుష్ప్రచారం చేయడం పరిపాటైందన్నారు. నదులు పూజలందుకుంటున్న పవిత్ర దేశంలో కోకాకోలా కంపెనీకి ఓ నదినే విక్రయించారని ఎద్దేవా చేశారు. రాజ్యసభలో సీపీఎం ఎంపీని ‘లుంగీవాలా’ అని బీజేపీ ఎంపీ హేళన చేయడం, కమ్యూనిస్టులను ‘అబద్దాల కోరులు’ అని ఆర్థిక మంత్రి విమర్శించడం వంటి అప్రజాస్వామిక ధోరణులు ఏ విలువలకు ప్రస్థానమని ప్రశ్నించారు. కొద్ది మంది చేతిలో ప్రకృతి వనరులు కేంద్రీకృతమైనంత కాలం ఆర్థిక అంతరాలు తగ్గడం సాధ్యమేనా అని అడిగారు. సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగితే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని అంబేడ్కర్ హెచ్చరించారని గుర్తుచేశారు.
రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘సర్’ (పౌరసత్వంపై ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియలో నిజంగానే మరణించిన వారు, చొరబాటుదారులు, డూప్లికేట్ ఓటర్లనే తొలగిస్తున్నారా అని ప్రశ్నించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 16 కోట్లకు పైగా ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్సీ-సీఏఏలతో చేయలేని పౌర ప్రక్షాళనను ‘సర్’ ద్వారా పూర్తి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓటు పోయినవారు సంఘాలు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మాజీ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ డీజీ నర్సింహారావు, కో-కన్వీనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
- JusticeBSudarshanReddySudarshanReddyFreeSpeechFreedomOfExpressionFreedomOfSpeechRationCardsRationCardBeneficiariesRationCardNumbersWelfareSchemesDevelopmentDevelopmentClaimsWelfarePoliticsSocialJusticeConstitutionalRightsDemocracyHumanRightsJusticeJudiciaryIndianConstitutionPoliticalNewsNationalNewsTelanganaNewsTelanganaPoliticsPublicPolicyWelfareDataGovernmentSchemesLatestPoliticalNewsLatestIndiaNewsLatestTeluguNewsTeluguNewsBreakingNewsLatestNews

