Krishna Water: కృష్ణా జలాలపై తెలంగాణ హక్కుల సాధనకు న్యాయపోరాటం.. అధికారులకు రేవంత్ ఆదేశం
రేవంత్ ఆదేశం

Krishna Water: కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించేందుకు సుప్రీంకోర్టులో సమర్థవంతమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ నిపుణులు, అధికారులను ఆదేశించారు. ఏపీతో ఉన్న వివాదాస్పద అంశాలపై అవసరమైన అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించాలని సూచించారు.
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఈ నెల 18 తర్వాత విచారణకు రానున్న నేపథ్యంలో మంగళవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, శాఖ కార్యదర్శి ఈ.శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కె.శ్రీనివాస్, అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్‌తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కృష్ణా జలాలపై రాష్ట్రానికి ఉన్న అన్ని హక్కులు సాధించేందుకు తగిన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు.
డిండి, అచ్చంపేట పథకాల పనులు వేగవంతం చేయాలి
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో నిర్మిస్తున్న డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల జలాశయం నుంచి ఈ రెండు పథకాలకు నీటిని అందించాలని చెప్పారు. అవసరమైన 0.6 టీఎంసీలను నార్లాపూర్ నుంచి ఏదుల జలాశయం వరకు తరలించేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. ఎక్కడ సొరంగాలు తవ్వాలి, ఎక్కడ కాలువలు అవసరమనేది గుర్తించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
కాళేశ్వరం అదనపు టీఎంసీపై జాగ్రత్త
కాళేశ్వరం అదనపు టీఎంసీ పనుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సీఎం అధికారులను హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటినే తరలించలేని పరిస్థితి ఉన్నందున అదనపు టీఎంసీ పనుల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ముందుగా సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలించి, భూసేకరణ చేపట్టాలని, కేంద్ర జలసంఘం నుంచి అవసరమైన అనుమతులు పొందడంతోపాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

