గంటకు పైగా సాగిన భేటీ.. నేడు కీలక సమావేశాలు

Revanth Reddy: మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించారు.

లోధీ ఎస్టేట్‌లోని వేణుగోపాల్‌ నివాసంలో జరిగిన ఈ భేటీ గంట 15 నిమిషాలపాటు సాగింది. పీసీసీ క్రమశిక్షణా సంఘం ఇప్పటికే పార్టీ అధిష్ఠానానికి నివేదిక సమర్పించిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఇద్దరూ వివరంగా చర్చించినట్లు తెలిసింది. ఆ నివేదిక ప్రకారం ఇద్దరిపైనా చర్యలు అవసరమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

సమావేశం తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడకుండానే నివాసం నుంచి బయలుదేరారు. అధికారికంగా ఎవరూ వివరాలు వెల్లడించలేదు. మంత్రి సురేఖ కూడా వేణుగోపాల్‌ను కలవాలని ప్రచారం జరిగినా ఆమె అక్కడికి రాలేదు. తన వాదనను అగ్రనేతలకు వినిపించి తప్పు లేదని వివరణ ఇవ్వడానికి ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా దిల్లీలో ఉన్నారు. రాష్ట్రంలో ఈ అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇద్దరిపై చర్యలు తీసుకుంటేనే పార్టీలో క్రమశిక్షణ సాధ్యమవుతుందన్న అభిప్రాయం సీఎం, పీసీసీ అధ్యక్షుడిది అని సమాచారం.

బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి మీనాక్షితో సమావేశం జరిగే అవకాశం ఉంది. క్రమశిక్షణా సంఘం నివేదికపై పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Next Story