Revanth Reddy: భాజపా పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు అమ్ముకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ కొడంగల్‌లోని అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నీట్ ప్రశ్నపత్రాలను పల్లీబఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్మేశారని ధ్వజమెత్తారు. రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నిరసనలు చేపట్టారని, ప్రజా ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో పాల్పడిన వారందరినీ అరెస్టు చేసి జైల్లో పెట్టాలని కూడా ఆయన కోరారు.

“లక్షలాది విద్యార్థుల జీవితాలతో ధర్మేంద్ర ప్రధాన్ చెలగాటం ఆడారు. ఆయన రాజీనామా చేయాలని దిల్లీలో యువత తీవ్ర ఆందోళన చేపట్టింది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా సమస్యలను ప్రస్తావించడం ప్రజా ప్రతినిధుల బాధ్యత. పార్లమెంట్ సమావేశాల్లో నీట్ లీకేజీ అంశంపై చర్చించాలని కాంగ్రెస్, ఇండియా కూటమి డిమాండ్ చేసినా ప్రభుత్వం అనుమతించడం లేదు. లోక్‌సభ స్పీకర్ కూడా అంగీకరించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి దురదృష్టకరం” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

దిల్లీ పోలీసులు రాహుల్ గాంధీని కొట్టడంతో ఆయన ముక్కు నుంచి రక్తం కారిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఈ దేశం కోసం రక్తం చిందించడంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, చివరివాడు కాదు. మహాత్మా గాంధీ తెల్లదొరలతో పోరాడి స్వాతంత్ర్యం తెచ్చారు. గాంధీజీని పొట్టనపెట్టుకున్న గాడ్సే వారసులు మీరు” అంటూ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.

తొలుత సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story