‘జ్ఞానేశ్‌ గో బ్యాక్‌’ నినాదంతో మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని దిశానిర్దేశం

Revanth Reddy: భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకుంటున్న నిర్ణయాల్లో తప్పులు జరుగుతున్నాయని ఆ సంఘంలోని ఇద్దరు సభ్యులే చెబుతున్నారు. అలాంటప్పుడు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు ఉన్న అభ్యంతరాలేంటి? ఆయన్ని ఎందుకు కాపాడుతున్నారు? మీతో కలిసి ఓట్లు తొలగించడమే ఇందుకు కారణం కాదా?—అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా ప్రశ్నించారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపుతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో దిల్లీలో సోమవారం జరిగిన ‘మార్చ్‌ ఫర్‌ డెమోక్రసీ’ ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు దిల్లీకి తరలివచ్చారు. ర్యాలీకి ముందు తెలంగాణభవన్‌లోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శ్రేణులతో సమావేశం నిర్వహించి పోరాట పంథాపై దిశానిర్దేశం చేశారు.

‘‘ఆనాడు భగత్‌సింగ్‌ నేతృత్వంలో ‘సైమన్‌ గో బ్యాక్‌’ నినాదమే దేశ స్వాతంత్య్ర పోరాటానికి దారి తీసింది. నేడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ‘జ్ఞానేశ్‌ గో బ్యాక్‌’ నినాదమే భాజపా నుంచి దేశానికి విముక్తి కల్పిస్తుంది. దీన్ని మరో స్వాతంత్య్ర పోరాట స్థాయిలో ఉద్యమంగా కొనసాగిద్దాం’’ అని సీఎం ఉద్ఘాటించారు.

ఓట్ల చోరీతో అధికారం నిలబెట్టుకునే పన్నాగంపై ఆయన వివరాలు చెప్పారు. భాజపా ఉనికి ఉన్న రాష్ట్రాల్లో సర్‌ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) ద్వారా ఓట్లను తొలగించి అధికారం సాధించారని, బెంగాల్‌, బిహార్‌, హరియాణా, మహారాష్ట్రల్లో భాజపా ప్రభుత్వాలు ఏర్పాటు కావడమే ఉదాహరణగా చెప్పారు. సర్‌ అమలు చేయని, భాజపా బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లోనే ఇతర పార్టీలు గెలుపొందాయన్నారు.

2014లో దేశంలో 81 కోట్లు ఉన్న ఓట్లు 2019లో 91 కోట్లకు, 2024లో 97 కోట్లకు పెరిగాయి. అయితే సర్‌ పేరిట ఇప్పటికే 13 కోట్ల ఓట్లు తొలగించారు. ఇంకో ఐదారు కోట్లు తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత జనాభా 140 కోట్లు కాగా, 70-75 శాతం లెక్కతో 100 కోట్లకు పైగా ఓట్లు ఉండాలి. కానీ తొలగింపుల తర్వాత 84 కోట్లే మిగిలాయి. జనాభా పెరిగితే ఓట్లు పెరగాలి కదా? దీనికి ప్రధాని పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా దేశంలో శ్రీమంతులు, భాజపా అనుకూలురనే రెండు వర్గాలను సృష్టిస్తోందని, వీరికే ఓటు హక్కు ఉండేలా చూస్తోందని ఆరోపించారు. పేదలు, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, భాజపాకు వ్యతిరేకంగా ఓటేసేవారి ఓట్లు తొలగించడం ద్వారా వారిని రాజకీయంగా బలహీనపరుస్తున్నారని అన్నారు. ఓటు కోల్పోతే రేషన్‌కార్డు రద్దు, సంక్షేమ పథకాలు నిలిపివేత జరుగుతుందని హెచ్చరించారు.

దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌ నుంచి వచ్చినవారికి ఓటు హక్కు కల్పించాలని నెహ్రూ ఆలోచనతో ఎన్నికల జాబితాలు తయారయ్యాయని, ఇందిరా గాంధీ, వాజ్‌పేయీల హయాంలో సర్‌ను ఓట్లు చేర్చడానికే ఉపయోగించారని గుర్తు చేశారు. 2014 తర్వాత మాత్రం ప్రాంతాలు, భాషలు, జాతులు, మతాల మధ్య చిచ్చు పెట్టి, తమను వ్యతిరేకించే వారి ఓట్లను తొలగించే కుట్ర పన్నారని ఆరోపించారు.

సీఈసీ నియామకంలోనూ కుట్ర ఉందన్నారు. గతంలో ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కమిటీ ఎన్నికల ప్రధాన అధికారిని ఎన్నుకునేది. 2023లో మోదీ ప్రభుత్వం చట్టాన్ని సవరించి సీజేఐని తొలగించి, హోంమంత్రిని చేర్చింది. రాహుల్‌ గాంధీ వ్యతిరేకించినా జ్ఞానేశ్‌కుమార్‌ను నియమించారు. ఆయన ద్వారా బిహార్‌, బెంగాల్‌, హరియాణా, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లలో దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, యువత ఓట్లు తొలగించారని, సోషల్‌ మీడియాలో భాజపా, మోదీ వ్యతిరేక పోస్టులు పెట్టేవారి ఓట్లు కూడా తీసేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రను మొదటిసారి బయటపెట్టింది రాహుల్‌ గాంధీ అని, ఆయన నేతృత్వంలో భాజపా దురాగతాలను తిప్పికొడతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Next Story