CM Revanth Reddy: గోవాలోని కున్కోలిమ్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్‌ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. గోవా ప్రజలు రెండుసార్లు భాజపాకు ఓటు వేసి మోసపోయారని, మూడోసారి అదే తప్పు చేయవద్దని హెచ్చరించారు.

‘‘దేశంలో ప్రస్తుతం పేదలు, ధనవంతులు అనే రెండు రకాల ప్రజలు ఉన్నారు. మోదీ ప్రభుత్వం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అడ్డుపెట్టుకుని పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్లను తొలగిస్తోంది. రాహుల్‌గాంధీ ఓట్ల తొలగింపుపై ఢిల్లీలో పోరాడుతున్నారు. అందుకే ఆయన ప్రతినిధిగా నేను గోవా సభకు వచ్చాను’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. గోవాలో కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ‘గోయ్‌ రాఖోన్న్‌’ పాదయాత్రలో పాల్గొని, చీఫ్టెన్స్‌ స్మారకం నుంచి కున్కోలిమ్‌ బస్టాండు వరకు నడిచారు. పాదయాత్రలో ప్రజల నుంచి వస్తున్న స్పందన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తాను చేసిన పాదయాత్రను గుర్తుకు తెస్తోందని, గోవాకు మంచి రోజులు రాబోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ను ప్రజలు ‘ప్రాపర్టీ సావంత్‌’ అని పిలుస్తున్నారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. భాజపా పాలనలో గోవా భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, రాష్ట్రాన్ని డ్రగ్స్‌ పెడ్లర్లు, భూమాఫియాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ‘‘గోవా యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చారు. గోవా నుంచి పదే పదే హైదరాబాద్‌కు డ్రగ్స్‌ వస్తున్నాయి. అందుకే మా రాష్ట్రంలో ఈగల్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశాం. డ్రగ్స్‌ను పూర్తిగా నియంత్రించాలని ఆదేశించాం. తెలంగాణ పోలీసు బృందాలను గోవాకు పంపి ఇక్కడి డ్రగ్స్‌ డీలర్లను పట్టుకుంటున్నాం. మత్తు నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని ప్రధాని మోదీ చెబుతున్నారు. గోవాలో, కేంద్రంలో పాలన భాజపా చేతిలో ఉంది. మరి డ్రగ్స్‌ మహమ్మారిని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో ప్రమోద్‌ సావంత్‌ సమాధానం చెప్పాలి’’ అని ఆయన నిలదీశారు.

భాజపాను రావణుడితో, కాంగ్రెస్‌ను రాముడితో పోల్చిన రేవంత్‌రెడ్డి, రావణుడిని ఓడించాలంటే రాముడు లాంటి కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చిన్న చిన్న పార్టీలు, స్వతంత్రులకు ఓటు వేస్తే చివరికి భాజపాకే మద్దతు ఇస్తారని, కాంగ్రెస్‌కు మెజారిటీ ఇస్తే సంక్షేమ పాలన అందుతుందన్నారు. ‘‘ఏటా జూన్‌లో రుతుపవనాలు తొలుత కేరళకు, తర్వాత గోవాకు వస్తాయి. 2026లో కేరళలో కాంగ్రెస్‌ గెలిచింది. రుతుపవనాల మాదిరిగానే ఇప్పుడు గోవాలోనూ కాంగ్రెస్‌ పవనాలు వీస్తున్నాయి. గోవాలో కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత రెండుసార్లు కేంద్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అదే జరుగుతుంది’’ అని ఆయన ధీమాగా చెప్పారు.

గోవా సభ అనంతరం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. సోమవారం సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఏఐసీసీ నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

Next Story