Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి: గల్ఫ్, ఇరాన్‌లోని తెలంగాణ వాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి – కేంద్రంతో నిరంతర సమన్వయం
కేంద్రంతో నిరంతర సమన్వయం

Revanth Reddy: ఇరాన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ వాసులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సూచించారు. భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు: ‘‘ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, ఎంబసీలు, కాన్సులేట్‌లు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను కచ్చితంగా అనుసరించాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటాం. రాష్ట్ర అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారులతో, భారత ఎంబసీ, కాన్సులేట్‌లతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలి.
తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. వారి క్షేమం, భద్రత కోసం అన్ని విధాలుగా కృషి చేస్తాం’’ అని సీఎం స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగినందున తెలంగాణ ప్రభుత్వం తమ ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, హెచ్చరికలను పాటించాలని సూచనలు జారీ అవుతున్నాయి.

