Minister Komatireddy: రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, రోడ్ల అభివృద్ధితోనే పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రేపల్లి గ్రామం, మంథని నియోజకవర్గంలో సుమారు రూ.384 కోట్ల విలువైన హ్యామ్‌, నాన్‌ప్లాన్‌ రహదారి అభివృద్ధి పనులకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మంత్రి కోమటిరెడ్డి బుధవారం శంకుస్థాపనలు చేశారు. సుల్తానాబాద్‌, మంథనిలో వేర్వేరుగా నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు.

‘‘ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ శాఖల పరిధుల్లో రూ.30 వేల కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల విలువైన బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. హైదరాబాద్‌ నుంచి రామగుండం వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణంపై కేంద్ర మంత్రితో చర్చలు జరిపాం. ప్రతిపాదిత రహదారిలో సుల్తానాబాద్‌ బైపాస్‌ కూడా మంజూరు చేయించేందుకు కృషి చేస్తాం. మంథనిలో రహదారుల అభివృద్ధికి రూ.800 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశాం. అన్ని రహదారులను 18 నెలల్లో పూర్తి చేస్తాం’’ అని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో పెద్దపల్లి జిల్లాలో రూ.900 కోట్ల విలువైన రహదారి పనులు మాత్రమే మంజూరు కాగా.. మా ప్రభుత్వ హయాంలో రూ.1,700 కోట్ల పనులు మంజూరయ్యాయి’’ అని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story