కేంద్ర ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్ తయారు

Roads and Buildings Minister Komatireddy Venkat Reddy: ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత వివరవంతమైన ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉందని, రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఉప్పల్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎల్బీనగర్-హయత్‌నగర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం అంశంపై నారాయణరెడ్డి ప్రశ్నించారు.

తన నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ దాటిన తర్వాత పనామా వద్ద ఫ్లైఓవర్ మంజూరు చేయించినందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ.. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడ వెళ్లడానికి రెండు మూడు గంటలు మాత్రమే పడేలా డబుల్ డెక్కర్ రోడ్డును మంజూరు చేశామని వివరించారు. కేంద్రం వార్షిక ప్రణాళికలో ఈ ప్రాజెక్టును చేర్చిన వెంటనే డీపీఆర్ తయారీ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story