Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి బలం, సంస్థాగత స్థితిగతులపై ఏఐసీసీ నూతన ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌కుమార్ సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ సుదీర్ఘ సమావేశాలు నిర్వహించారు. గాంధీ భవన్‌లో మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో విడివిడిగా ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించారు.

క్షేత్రస్థాయిలో పార్టీ ఎలా ఉంది, ప్రజలు ఏం అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. కొన్ని జిల్లాల్లో గ్రామ, మండల కమిటీల నియామకాలు ఇంకా పూర్తి కాలేదని, ఎప్పటిలోగా పూర్తి చేస్తారని మంత్రులు, డీసీసీ అధ్యక్షులను అడిగారు. ఒక్కో మంత్రితో దాదాపు అరగంటపాటు చర్చించారు.

డీసీసీ, అనుబంధ సంఘాల అధ్యక్షులను పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నారు, ఏయే పదవులు నిర్వహించారు, గ్రామ, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి ఏం చేస్తున్నారని వివరాలు అడిగారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలంటే ఇప్పటి నుంచే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలని నేతలను ప్రోత్సహించారు.

2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు తొమ్మిదిన్నరేళ్లపాటు కాంగ్రెస్ అధికారంలో లేదని, అప్పుడు భారాస పాలనలో నానా కష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకులకు ఇప్పుడు ఆదుకోవాల్సిన అవసరముందని కొందరు మంత్రులు, డీసీసీ అధ్యక్షులు సందీప్‌కు చెప్పారు.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని, ఏదైనా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు, స్థానిక నేతలకు మధ్య విభేదాలు ఏర్పడితే వాటిని పరిష్కరించి కలసి పనిచేసేలా చూడాలని సందీప్‌కుమార్ సూచించారు.ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు సరైన గుర్తింపు ఉండటం లేదని, ఏదైనా పదవి ఇచ్చి ప్రొటోకాల్ సమస్యను పరిష్కరించాలని డీసీసీ అధ్యక్షులు కోరారు. సందీప్‌తో సమావేశం కావడానికి ముందు డీసీసీ అధ్యక్షులు విడిగా ఫతేమైదాన్ క్లబ్‌లో సమావేశమై తమ సమస్యలపై చర్చించుకున్నారు. అందరూ ఒకేమాటగా తమ సమస్యలు, ప్రధానంగా ప్రొటోకాల్ విషయాన్ని సందీప్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సంస్థాగతంగా చాలా బాగా పనిచేస్తున్నాయని సందీప్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు.వచ్చే రెండేళ్లలో పార్టీని మరింత బలోపేతం చేసి గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అవినీతి, విభజన శక్తులైన బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లపై ఐక్యంగా పోరాడుతున్నామని అన్నారు.

నూతన ఇన్‌ఛార్జి సందీప్‌కుమార్ తన మొదటి సందర్శనలో పార్టీ అంతర్గత విభేదాలను పరిష్కరించడం, సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సన్నాహాలపై దృష్టి సారించారు. మంత్రులు, డీసీసీ అధ్యక్షులతో జరిగిన చర్చలు పార్టీని మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story