సమాజానికి చేర్చాలి: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: శాస్త్ర విజ్ఞానం ల్యాబోరేటరీల నాలుగు గోడల మధ్యే పరిమితం కాకుండా సాధారణ ప్రజలకు చేరేలా చూడాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. సమాజంలో శాస్త్ర సాంకేతిక రంగాలపై నమ్మకాన్ని, అవగాహనను పెంచడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ‘ఈనాడు’ గ్రూప్ ఆధ్వర్యంలో బీఎం బిర్లా సైన్స్ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన ‘ల్యాబ్ టూ సొసైటీ - రోల్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్ బిల్డింగ్ వీబీ-2047’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రామోజీ రావు తెలుగు పత్రికా రంగంలో విప్లవం సృష్టించారని, ఆయన దూరదృష్టి, క్రమశిక్షణ, అంకితభావం అపూర్వమని వెంకయ్య నాయుడు కొనియాడారు. ‘ఈనాడు’ సమాజ సంక్షేమం పట్ల ఆలోచన, చర్యలు డీఎన్ఏలోనే భాగమని, శాస్త్రీయ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం మరింత ప్రశంసనీయమని చెప్పారు. తెలుగు పాఠకులకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలన్న రామోజీ రావు తాపత్రయం ఫలితంగానే ‘జ్ఞాననేత్రం’ వంటి శీర్షికలు ప్రచురితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

క్లిష్టమైన శాస్త్రీయ అంశాలను సులభంగా అర్థమయ్యే రూపంలో ప్రజలకు చేరవేయడం శాస్త్రవేత్తలు, నిపుణుల బాధ్యతగా ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఉత్సుకతను పెంచడం, సమాజంలో శాస్త్ర సాంకేతికతలపై విశ్వాసాన్ని కల్పించడం ద్వారానే దేశం ఈ రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

భారత్‌లో మేధస్సుకు ఎన్నటికీ కొదవ లేదని, రామానుజన్, శకుంతలా దేవి, సీవీ రామన్, అబ్దుల్ కలాం వంటి మహానుభావులు దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారని ఆయన గుర్తు చేశారు. స్వదేశీ జ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు, క్షిపణులు అభివృద్ధి చేసి ఎగుమతి స్థాయికి చేరుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. మానవ జీవన నాణ్యతను మెరుగుపరచడంలో శాస్త్ర సాంకేతికతల పాత్ర కీలకమని, హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కృషితో ఆహార రంగంలో స్వయంసమృద్ధి సాధించామని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రైవేటు సంస్థలు కూడా ఈ రంగంలో ముందుకు వస్తున్నాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం. నాగేశ్వర రావు, ఏఎస్‌టీసీ గౌరవ అధ్యక్షుడు డా. ఆర్‌బీఎన్ ప్రసాద్, ఎస్‌ఏసీ-ఏఎస్‌టీసీ ఛైర్మన్ డా. సీహెచ్ మోహన్ రావు, డబ్ల్యూహెచ్‌ఓ మాజీ శాస్త్రవేత్త డా. సౌమ్యా స్వామినాథన్, అనంత్ టెక్నాలజీస్ సీఎండీ డా. పావులూరి సుబ్బారావు, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ డా. డి. శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story