తీరని బాధ

Section 22-A: నిషేధిత భూముల జాబితా (22ఏ)లో చేరిన స్థిరాస్తులకు ఇంకా విముక్తి లభించడం లేదు. యూఎల్సీ (అర్బన్ ల్యాండ్ సీలింగ్), ఎసైన్డ్, భూదాన్, వక్ఫ్, దేవాదాయ తదితర భూములుగా నమోదైన ప్రైవేటు స్థలాల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం సెప్టెంబరు 24న ప్రత్యేకంగా మెమో నం.47934ను జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ మెమో జారీ చేశారు. కానీ కొత్తగా యూఎల్సీ కింద ఉన్నాయని వెలుగుచూస్తున్న స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి.
ప్రభుత్వం వద్ద వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసినవి, వేలం పాట తరువాత లే అవుట్లుగా మారినవి, వివిధ జీవోలతో క్రమబద్ధీకరణ అయిన స్థలాలు, హెచ్ఎండీఏ లేఅవుట్లు చేసి విక్రయించినవి, ఒకే సర్వే నంబరులో ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు ఉన్నవి, కోర్టు ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాలు.. ఇలాంటి స్థిరాస్తుల సర్వే నంబర్లు 22ఏ నుంచి బయటపడకపోవడంతో యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విక్రయానికో, తనఖా కోసమో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేదాకా వారి ఆస్తి నిషేధిత జాబితాలో ఉందన్న విషయం తెలియడం లేదు. ప్రభుత్వం మెమో జారీ చేసినా అది పాత దరఖాస్తులకేనంటూ సబ్ రిజిస్ట్రార్లు తిరస్కరిస్తున్నారు. రీ సర్వే చేయించుకుని రావాలని సూచిస్తున్నారు. సర్వేకు దరఖాస్తు చేస్తే చాలా రోజులు పడుతోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యూఎల్సీ జాబితా నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2600 ఎకరాల వరకు విస్తీర్ణాన్ని తొలగించాల్సి ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోనూ యూఎల్సీ సమస్యలు భారీగా ఉన్నట్లు అంచనా. హైదరాబాద్ నగరంలోని వల్లభ్‌నగర్, అల్వాల్, మణికొండ, మాదాపూర్, శేరిలింగంపల్లి, రామంతపూర్, కాప్రా తదితర ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలున్నాయి.
నిబంధనలు లేవంటూ..
మణికొండలో సర్వే నంబరు 70లో ఉన్న ఫ్లాట్ విక్రయ రిజిస్ట్రేషన్ కోసం యజమాని ప్రయత్నిస్తే అది యూఎల్సీ జాబితాలో ఉందని సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ఎక్కడో ఒక మూల చిన్న విస్తీర్ణం యూఎల్‌సీకి సంబంధించినది ఉండడమే దీనికి కారణం. స్థానిక సంస్థల అనుమతి పత్రాలుంటే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలంటూ ప్రభుత్వం సెప్టెంబరు 24న జారీ చేసిన ఉత్తర్వులున్నా అవి పాత దరఖాస్తులకే వర్తిస్తాయని అధికారులు బదులిస్తున్నారు. ఆర్డీవోను, కలెక్టర్‌ను సంప్రదించినా స్పష్టత లేదని కక్షిదారు ఆవేదన.
మాదాపూర్‌లోనూ ఒక యజమానికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. స్థలం ఉన్న సర్వే నంబరు 22ఏ జాబితాలో ఉందని తిరస్కరించారు. హెచ్ఎండీఏ నుంచి స్పష్టతనిస్తూ సర్టిఫికెట్ సమర్పించినా రీ సర్వే చేయించి సర్టిఫైడ్ కాపీ తీసుకుని రావాలని అధికారులు సూచించారు.
పెండింగ్ అప్లికేషన్లు పూర్తయ్యాకే కొత్తవి
యూఎల్సీలకు సంబంధించి కోర్టు వ్యాజ్యాల్లో ఉన్నవి 8 వేలు, ఇతరత్రా కలిపి దాదాపు 13 వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. కోర్టుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని, ఇవి పూర్తికాగానే కొత్త దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. యూఎల్సీ జాబితాలో ఉన్న భూములు, స్థలాల క్రమబద్ధీకరణ పూర్తికాకుండా రిజిస్ట్రేషన్లు జరగవని ఆయన స్పష్టం చేశారు.

