Deputy CM Bhatti Vikramarka: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (టీజీఎస్‌పీఎఫ్‌) 36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పటిష్ఠమైన రక్షణ, భద్రతే అభివృద్ధికి పునాది అని ఆయన స్పష్టం చేశారు.


ప్రత్యేక రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రగతిలో ప్రత్యేక దళాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 67 సంస్థలకు రెండు వేల మందికి పైగా ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సేవలు అందిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యుదుత్పత్తి కేంద్రాల రక్షణలో వీరు సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.


భద్రతా సిబ్బంది సేవల వెనుక కుటుంబ సభ్యుల త్యాగాలు మరువలేనివని వెల్లడించారు. డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్‌ సాంకేతికత భద్రతా రంగంలో కొత్త సవాళ్లని ఎదుర్కొంటున్న నేపథ్యంలో శారీరక దృఢత్వంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం అవసరమని సూచించారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా భద్రతా సిబ్బందికి నిరంతర శిక్షణ అవసరమని, అమీన్‌పూర్‌లో ప్రత్యేక శిక్షణ అకాడమీ ఉండటం సంతోషకరమని చెప్పారు. ఆయుధాల కంటే క్రమశిక్షణ, నిజాయతీ, బాధ్యత పోలీసులకు ముఖ్యమని నొక్కి చెప్పారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, టీజీఎస్‌పీఎఫ్‌ డీజీ స్వాతి లక్రా, సిబ్బంది, అధికారులు, విశ్రాంత అధికారులు పాల్గొన్నారు.

Next Story