Cm Revanth : ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఎంపిక మనకి గర్వకారణం
జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.. సీయం రేవంత్‌రెడ్డి

ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి మద్దతు కూడగట్టే విషయమై సీయం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, రాజకీయాలకు అతీతంగా ఉండే జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒక వైపు, మహాత్ముడి స్పూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతున్న ఇండియా కూటమి మరోవైపు ఉన్నాయని సీయం అన్నారు. పీవీనరసింహారావు తరువాత ఒక తెలుగువాడిని ఆ స్ధాయిలో ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించడం గర్వాకారణమన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరం ఏకం కావాల్సిన సందర్భం అని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని సీయం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉపరాష్ట్రపతిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. చంద్రబాబు నాయుడు, కెసీఆర్, పవన్ కళ్యాణ్, కమ్యూనిస్ట్ సోదరులు, ఉభయ రాష్ట్రాల బీజేపీ ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీయం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఆయన్ని ఒక న్యాయనిపుణుడిగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిందని సీయం తెలిపారు. పీవీనరసింహారావు నంద్యాల ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎన్టీఆర్ ఆయనపై ఎవరినీ పోటీలో నిలపకుండా రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారని సీయం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పుడు ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు అదే విజ్ఞతను ప్రదర్శించాలని సీయం రేవంత్‌రెడ్డి కోరారు.
