Suravaram Sudhakarreddy : సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత
వామపక్ష రాజకీయాల్లో తలపండిన సురవరం సుధాకర్‌రెడ్డి

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మాజా జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. సుధాకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వామ పక్ష రాజకీయాల్లో భారత దేశంలోనే అత్యంత ముఖ్యమైన నాయకుడిగా ఆయన సేవలందించారు. వృద్ధాప్యం కారణంగా వాటిల్లిన అనారోగ్య సమస్యల వల్ల ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు నియోజకగర్గంలోని కొండ్రావుపల్లిలో 1942 మార్చి 25వ తేదీన సురవరం సుధాకర్‌రెడ్డి జన్మించారు. వెంకట్రామ్‌రెడ్డి, ఈశ్వరమ్మలు ఆయన తల్లితండ్రులు. ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత కర్నూలు జిల్లాలో ఉన్న ఉస్మానియా కళాశాలలో బీఏ పట్టభద్రులయ్యారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి వామపక్ష రాజకీయాలతో మమేకమైన సుధాకర్‌రెడ్డి 1966లో ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధానకాదర్శిగా పనిచేసి 1970లో జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఆతరువాత సీపీఐతో తన అనుబంధాన్ని కొనసాగించి వామపక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.
తొలుత 1984లో ఆతరువాత 1990లో కొల్లాపూర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 1994లో కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ స్ధానం నుంచి అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. దీని తరువాత 1998, 2004ల్లో నల్గొండ పార్లమెంట్ స్ధానం నుంచి సీపీఐ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇక పార్టీలో కూడా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2019 వరకూ సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌రెడ్డి పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సురవరం సుధాకర్‌రెడ్డి మృతి తెలంగాణకే కాదు యావత్ భారతదేశానికి తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబానాయుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డిలు సురవరం మృతి పట్ల తమ దాగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సీపీఐ సీనియర్ నాయకులు రాజా, కె.నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావులు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యహ్నం 3 గంటల వరకూ అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనార్ధం సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహాన్ని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్‌లో ఉంచుతారు. అనంతరం సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన శరీరాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాలకు డొనేట్ చేయనున్నారని సీపీఐ శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు మీడియాకు తెలిపారు.
