తమన్నా, సమంత, రకుల్ పేరిట నకిలీ ఓటర్ ఐడీలు!

Sensational Twist in Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సినీ తారలైన తమన్నా భాటియా, సమంత రూత్ ప్రభు, రకుల్ ప్రీత్ సింగ్ పేరిట నకిలీ ఓటర్ ఐడీ కార్డులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు తీవ్రంగా స్పందించారు. విచారణలో ఈ ఐడీ కార్డులు వేరే వ్యక్తుల ఎపిక్ నంబర్లతో ఫ్యాబ్రికేట్ చేసినవని తేలింది.

ఈ నకిలీ ఓటర్ ఐడీల ప్రచారంపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ కార్డులను ఎవరు తయారు చేశారు, ఎక్కడ నుంచి సోషల్ మీడియాలో వైరల్ చేశారనే అంశాలపై విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ముమ్మర ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి.

ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్‌లో బోగస్ ఓట్ల తొలగింపు కోసం బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్‌లో 1,900కు పైగా బోగస్ ఓట్లు, 12,000 మంది బయటి వ్యక్తుల ఓట్లు ఉన్నాయని, కొందరికి రెండు ఓట్లు కూడా ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అవినాష్, ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని, అక్టోబర్ 21 వరకు ఓటర్ జాబితాను పరిశీలిస్తామని కోర్టుకు వివరించారు. జిల్లా ఎన్నికల అధికారిని ఇప్పటికే వివరణ కోరినట్లు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, కేసు విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story