ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వచ్చిన వరుస బెదిరింపులు నగరంలో కలకలం రేపాయి. బాంబులు పెట్టినట్లు బెదిరించిన ప్రదేశాలన్నీ అంత్యంత కీలక ప్రాంతాలు కావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తొలుత పాత బస్తీలో ఉన్న సిటీ సివిల్‌ కోర్టులో బాంబులు పెట్టినట్లు బెదిరింపు మెయిల్‌ రావడంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. అబీదా అబ్దుల్లా పేరుతో నాలుగు చోట్ల ఆర్డీఎక్స్‌ బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్‌ పంపించాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటు జడ్జి ఛాంబర్‌, జింకానా క్లబ్‌, న్యాయవాదుల నివాస సముదాయాల్లో ఆర్డీఎక్స్‌ బాంబులు అమర్చినట్లు మెయిల్‌ పంపాడు. కోర్టులో బాంబు పేలిన 23 నిమిషాల తరువాత జింఖానా క్లబ్‌ లో బాంబు పేలుతుందని ఈమెయిల్‌ లో హెచ్చరించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నాలుగు ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మూసివేయడంతో పాటు కోర్టు కార్యకలాపాలన్నీ నిలిపివేశారు. తాజాగా రాజ్‌ భవన్‌ లో బాంబు అమర్చినట్లు మరో బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో పోలీసులు రాజభవన్‌ లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు.

Politent News Web 1

Politent News Web 1

Next Story