Revanth Reddy’s US Visit:: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఈఏ) అనుమతి నిరాకరించిన విషయంపై శుక్రవారం కేంద్రం స్పష్టీకరణ ఇచ్చింది. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల విదేశీ పర్యటనలకు అనుమతి మంజూరు చేసే ముందు విదేశీ వ్యవహారాల శాఖ వివరాలను పరిశీలిస్తుందని తెలిపారు.

‘‘వారు చేసే పర్యటన.. నిర్వహిస్తున్న పదవి ఉద్దేశానికి తగినట్లుగా ఉండాలి. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి యూకే పర్యటనకు అనుమతి లభించింది. అమెరికా పర్యటన విషయంలో మాత్రం ఆ నిబంధనలను పాటించలేదు. అందుకే అనుమతి నిరాకరించాం’’ అని రణధీర్‌ జయస్‌వాల్‌ స్పష్టం చేశారు. ప్రతిపాదిత కార్యక్రమం సీఎం పదవికి, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా లేదని భావించడంతోనే అనుమతి నిరాకరించినట్లు ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్‌’ కార్యక్రమంలో భాగంగా యూకే, అమెరికా పర్యటనకు అనుమతి కోరింది. యూకే లెగ్‌కు మాత్రమే అనుమతి వచ్చింది. ప్రస్తుతం లండన్‌లో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 23న లండన్‌ నుంచి అమెరికా (బోస్టన్‌ తదితర నగరాలు) వెళ్లి, హార్వర్డ్‌, ఎంఐటీ, నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ, వర్జీనియా టెక్‌ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆగస్టు 30న హైదరాబాద్‌ చేరుకోవాల్సి ఉంది. అనుమతి రాకపోవడంతో పర్యటన రద్దయింది. ఆయన ఆగస్టు 23నే లండన్‌ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ.. రాజకీయ కోణంలో అనుమతి నిరాకరించడం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ‘‘కేంద్ర నూతన విద్యా విధానాన్ని అమలు చేయటమే నా లక్ష్యం. తెలంగాణకు అత్యుత్తమ విద్యాసంస్థలు తీసుకురావడమే పర్యటన ఉద్దేశం. వికసిత్‌ భారత్‌కు దోహదపడుతుందని భావించా. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని నమ్ముతాను’’ అని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అమెరికా పర్యటన రద్దయినా.. అధికారుల బృందం అక్కడికి వెళ్లి ప్రతిపాదిత ఎంవోయూలు, భాగస్వామ్య ఒప్పందాలను యథాతథంగా చేసుకోవాలని ఆదేశించారు.

లండన్‌లో సీఎం షెడ్యూల్‌ ప్రకారం ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌, లండన్‌ బిజినెస్‌ స్కూల్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ ప్రతినిధులతో సమావేశాలు కొనసాగుతున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story