Simba: సింబా దూసుకొస్తోంది... Simba పట్టేస్తుంది!
Simba పట్టేస్తుంది!
Simba: మత్తు పదార్థాల నియంత్రణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక నిఘా కోసం జాగిలం సింబాను ఉపయోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, యువతపై దాని ప్రభావాన్ని అరికట్టేందుకు పోలీసు శాఖ నార్కోటిక్స్ విభాగానికి శిక్షణ పొందిన సింబాను అందించింది. రామగుండం పోలీసు కమిషనరేట్‌లో కొత్తగా ఏర్పాటైన నార్కోటిక్స్ విభాగం సింబా సేవలను వినియోగిస్తోంది.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి దళారుల ద్వారా గంజాయి జిల్లాకు సరఫరా అవుతోంది. పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల విక్రయాలు కొనసాగుతున్నాయి. గంజాయి సరఫరాను అడ్డుకునేందుకు సింబా జాగిలం కీలక పాత్ర పోషిస్తోంది.
రూ. 10 వేల వేతనంతో సింబా..
సింబాకు ఐదు నెలల వయసులోనే మొయినాబాద్‌లో మత్తు పదార్థాలను గుర్తించే శిక్షణ ఇచ్చారు. కానిస్టేబుల్ వేణుగోపాలకృష్ణకు సింబాతో పాటు ఎనిమిది నెలల శిక్షణ అందించారు. సింబాకు నెలకు రూ.10,000 వేతనం ఇస్తున్నారు, దీనితో దాని ఆహారం, వైద్య సంరక్షణను సమకూర్చుతున్నారు. గత ఎన్నికల సమయంలో, నిర్బంధ తనిఖీలు, జన సంచారం ఉన్న ప్రాంతాల్లో సింబాతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఉత్తమ పోలీస్ డాగ్‌గా సింబా..
వరంగల్ జిల్లా మామునూరు పోలీసు శిక్షణ కేంద్రంలో గత నెల జరిగిన తెలంగాణ రాష్ట్ర రెండో పోలీస్ డ్యూటీ మీట్‌లో కాళేశ్వరం జోన్ నుంచి పాల్గొన్న సింబా బంగారు పతకం సాధించింది. సింబాతో పాటు వేణుగోపాలకృష్ణను రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా అభినందించారు. 2026 ఫిబ్రవరిలో పూణెలో జరిగే జాతీయ పోలీస్ డ్యూటీ మీట్‌లో సింబా పాల్గొననుంది.
సమాచారం అందించండి: అంబర్‌కిషోర్ ఝా
మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా 87126 59388 నంబర్‌కు తెలియజేయాలని రామగుండం పోలీసు కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా కోరారు. సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకుంటామని, గంజాయి రహిత కమిషనరేట్‌గా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
