సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటన

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు రావని, దేశవ్యాప్తంగా 2029లో జరిగే జమిలి ఎన్నికలతోపాటే జరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తన పదవీకాలం ఐదేళ్లు కాకుండా ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లు కొనసాగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం దిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేసి, అరవై రోజుల్లో జనాభా లెక్కలు ప్రచురిస్తుందని ఆయన తెలిపారు. మే-జూన్‌లో లెక్కలు విడుదలైన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కోసం కమిషన్‌ ఏర్పాటు చేస్తుందని, సంవత్సరంలోపు సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేస్తుందని వివరించారు. అందువల్ల 2029లో కొత్త నియోజకవర్గాల ప్రకారం జమిలి ఎన్నికలు జరుగుతాయని ఆయన ఉద్ఘాటించారు.

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ జాప్యం ఎందుకు?

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తులో జాప్యం ఎందుకు జరుగుతోందో కిషన్‌రెడ్డి చెప్పాలని సీఎం డిమాండ్‌ చేశారు. ఆయన కాదంటే హోంమంత్రి సహాయకుడు బండి సంజయ్‌ అయినా అధికారులతో చర్చించాలని సూచించారు. ఫార్ములా-ఈ రేస్‌ కేసును ఈడీకి అప్పగించినా చర్యలు లేవని, విద్యుత్‌ ఒప్పందాలపైనా కేంద్రానికి లేఖ రాయబోతున్నామని తెలిపారు. కిషన్‌రెడ్డి భారాసతో లోపాయికారీ లేకుండా సత్యహరిశ్చంద్రుడైతే వీటిపై విచారణ జరిపించాలని ఆయన సవాల్‌ విసిరారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై సీబీఐకి కేస్‌ బై కేస్‌ అనుమతులు ఇస్తున్నామని చెప్పారు.

భాజపా-భారాస-ఎంఐఎం కుమ్మక్కు

నేను భారాసతో కుమ్మక్కయ్యానని కిషన్‌రెడ్డి ఆరోపిస్తుంటే, భాజపాతో కలిసి రాజకీయాలు చేస్తున్నానని కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత ఆరోపిస్తున్నారని సీఎం అన్నారు. తన పని దుష్టశిక్షణ, శిష్టరక్షణ మాత్రమేనని స్పష్టం చేశారు. భాజపా భారాస, ఎంఐఎంలతో కలిసి రాజకీయాలు చేస్తోందని, ఎంఐఎం భాజపాకు పరోక్ష సహకారం అందిస్తోందని ఆరోపించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌లో సిట్‌కు పూర్తి స్వేచ్ఛ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడు ప్రభాకర్‌రావును రప్పించడంలో కేంద్రం సహకరించలేదని, 20 నెలలు సుప్రీంకోర్టు ద్వారా రప్పించాల్సి వచ్చిందని రేవంత్‌ తెలిపారు. పైనున్నవారు చెప్పడంతోనే ట్యాపింగ్‌ చేశానని ఆయన విచారణలో చెప్పారని, ఆ ఆధారంగా మరికొందరిని విచారించారని అన్నారు. సిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ నేతృత్వంలో సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టారని వివరించారు.

కాళేశ్వరంలో పిల్లర్లు కూలిపోయే ప్రమాదం

కాళేశ్వరం పిల్లర్లు దెబ్బతిన్నాయని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని సీఎం అన్నారు. కానీ కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు, సురేశ్‌రెడ్డి మూడు పిల్లర్లు మాత్రమే కుంగాయని, రిపేరు చేస్తే సరిపోతుందని చెబుతున్నారని విమర్శించారు. నీరు నిలబెడితే 33 పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని, ప్రాజెక్టు మొత్తం కుంగిపోతే నెపం మాపై నెట్టాలని కేసీఆర్‌ బృందం ఎత్తులు వేస్తోందని ఆరోపించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story