CEO Sudarshan Reddy: తెలంగాణలో జూన్ 25 నుంచి SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాను సమగ్రంగా శుద్ధి చేయడమే లక్ష్యమని, ఎవరినీ తొలగించడం లేదని ఆయన వివరించారు.

శనివారం మీడియాతో మాట్లాడిన సీఈవో సుదర్శన్ రెడ్డి, జూన్ 15 నుంచి 24 వరకు సన్నాహక పనులు జరుగుతాయని, జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫాం అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మిస్ అయిన వారికి ఫారం-6 ద్వారా మరోసారి ఫాం అందించే అవకాశం ఉంటుందన్నారు.

జులై 31న ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల చేస్తామని, జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు చెప్పారు. అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియలో సహకరించాలని సీఈవో విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుత అడ్రస్‌కు ఫాం వస్తుంది

ప్రస్తుతం ఓటు ఉన్న అడ్రస్‌కు ఎన్యూమరేషన్ ఫాం వస్తుందని సీఈవో తెలిపారు. ఆ అడ్రస్‌లో ఓటరు లేకపోతే ఆ ఓటు తొలగించబడుతుంది. కానీ ప్రస్తుత అడ్రస్‌తోనే ఫారం-8 ద్వారా మళ్లీ ఎన్‌రోల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

24 ఏళ్ల తర్వాత శుద్ధి

గత 24 ఏళ్లుగా ఓటర్ల జాబితా శుద్ధి జరగలేదని, ఈ కాలంలో చాలా మంది మృతి చెందినా, వలస వెళ్లినా ఉన్నారని సుదర్శన్ రెడ్డి వివరించారు. వాటన్నింటినీ సరిదిద్దడమే SIR లక్ష్యమని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపణ లేదని స్పష్టం చేశారు.

అందరికీ ఫాం.. ఎలాంటి వ్యత్యాసం లేదు

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఎన్యూమరేషన్ ఫాం అందుతుందని, కులం, మతం తేడా లేకుండా అందరికీ ఇస్తారని చెప్పారు. ముస్లిం, హిందూ అనే తేడా లేకుండా ప్రక్రియ జరుగుతుందని, ఒక్క వర్గం ఓట్లు తొలగిస్తారనే ఆందోళన అవసరం లేదని సీఈవో హామీ ఇచ్చారు.

SIR ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితా ప్రక్షాళన

ఓటర్లను తొలగించడం కాదు, జాబితాను శుద్ధి చేయడమే లక్ష్యమని సుదర్శన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ ప్రక్రియలో ప్రజలు సహకరించాలని, ఆందోళన వద్దని విజ్ఞప్తి చేశారు.

Next Story