Sudarshan Reddy: ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ఎస్‌ఐఆర్ లక్ష్యం: సుదర్శన్ రెడ్డి
అనర్హులు లేకుండా చూడటమే ఎస్‌ఐఆర్ లక్ష్యం: సుదర్శన్ రెడ్డి

Sudarshan Reddy: తెలంగాణలో వచ్చే నెల 15 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ప్రారంభమవుతుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. జూన్ 25 నుంచి జులై 24 వరకు ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు తెలిపారు.
శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియ వివరాలను వెల్లడించారు. బూథ్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు) ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్‌లు అందజేస్తారని, ప్రతి ఓటరుకు రెండు ఫామ్‌లు ఇవ్వబడతాయని చెప్పారు. ఒక ఫామ్‌ను పూర్తి చేసి బీఎల్‌ఓలకు అందించాల్సి ఉంటుందని, మరొక ఫామ్‌ను ఓటరు తన దగ్గర అక్నాలెడ్జ్‌మెంట్ ఫామ్‌గా ఉంచుకోవచ్చని వివరించారు.
ఆన్‌లైన్‌లో voters.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ చేసుకునే సౌకర్యం ఉందని సుదర్శన్ రెడ్డి తెలిపారు. సేకరించిన ఫామ్‌ల ఆధారంగా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసి, రాజకీయ పార్టీలకు అందజేస్తామన్నారు. జులై 31న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, అవి పరిష్కరించిన తర్వాత అక్టోబరు 1న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని వివరించారు.
రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ జరిగిన సంగతిని గుర్తు చేస్తూ, దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అనర్హులు లేకుండా చూడటమే ఈ ప్రక్రియ ముఖ్య లక్ష్యం అని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన అందరూ ఓటర్ల జాబితాలో చేరాలని, అనర్హులు తొలగించబడాలని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు, ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

