Deputy CM Bhatti Vikramarka: సీతారామ సాగర్ ప్రాజెక్ట్ను వేగంగా పూర్తి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Deputy CM Bhatti Vikramarka: గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం సీతారామ సాగర్ ప్రాజెక్టును త్వరిత గతిన పూర్తి చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అశ్వాపురం మండలంలోని సీతారామ సాగర్ ప్రాజెక్ట్ పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “గోదావరిపై చివరి ప్రాజెక్ట్ సీతారామ సాగర్. దీనిని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచించి బడ్జెట్‌ను పెంచి ప్రాజెక్టును రీడిజైన్ చేసింది. గోదావరిపై జరుగుతున్న అక్రమాలపై ఆనాడు శాసనసభలోనూ, బయటా గళం విప్పాం. ఇప్పటివరకు ఎంత మేరకు పనులు పూర్తయ్యాయో సమీక్షించడానికి ఈ పర్యటన చేపట్టాం. ప్రజా ప్రభుత్వంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తాం” అని అన్నారు.
ఈ పర్యటనలో ప్రాజెక్ట్ పనుల ప్రగతి, ఆర్థిక సమస్యలు, తదుపరి చర్యలపై సమగ్ర సమీక్ష జరిగింది. ప్రాజెక్టు పూర్తి అయితే రైతులకు సాగునీటి సదుపాయం కల్పించడంతోపాటు తెలంగాణ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వివరించారు.

